టీ20 ప్రపంచకప్-2024 తర్వాత టీమిండియా ఓపెనర్‌గా వచ్చి అదరగొట్టాడు సంజూ శాంసన్ (Sanju Samson). పదమూడు ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌గా వచ్చి 183కు పైగా స్ట్రైక్‌రేటుతో పరుగులు రాబట్టాడు. ఇందులో ఏకంగా మూడు శతకాలు కూడా ఉండటం గమనార్హం.
గిల్ రాకతో గందరగోళం
అయితే, ఆసియా టీ20 కప్-2025 సందర్భంగా శుబ్‌మన్ గిల్ (Shubman Gill) వైస్ కెప్టెన్‌గా రీ ఎంట్రీ ఇవ్వడంతో సంజూకు కష్టాలు మొదలయ్యాయి. భవిష్య కెప్టెన్ గిల్ ఓపెనర్‌గా వచ్చేందుకు సంజూపై వేటు వేసింది యాజమాన్యం. ఇక ఆ టోర్నీలో సంజూకంటూ బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రత్యేక స్థానం లేకుండా పోయింది.
ఆసియా కప్ టోర్నీలో మూడుసార్లు ఐదో స్థానంలో.. ఓసారి ఆరో స్థానంలో సంజూను బ్యాటింగ్‌కు పంపారు. ఇక బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లోనైతే ఎనిమిదో స్థానం వరకు అతడికి పిలుపేరాలేదు. వికెట్ కీపర్‌గా మాత్రమే టోర్నీ ఆసాంతం అతడి సేవలు వాడుకున్నారు.
తాజాగా ఆస్ట్రేలియా పర్యటనలోనూ తొలి టీ20లో శుబ్‌మన్ గిల్- అభిషేక్ శర్మ (Abhishek Sharma)తో కలిసి భారత ఇన్నింగ్స్ ఆరంభించాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ చీఫ్ సెలక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ సంజూ శాంసన్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు.
దురదృష్టవంతుడైన ఆటగాడు
యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘జట్టులో ప్రస్తుతం అత్యంత దురదృష్టవంతుడైన ఆటగాడు సంజూ శాంసన్. ఓపెనర్‌గా సెంచరీ చేసిన ఘనత అతడిది. కానీ ఇప్పుడు 3-8 వరకు ఏ స్థానంలోనైనా మేనేజ్‌మెంట్ అతడిని పంపేందుకు వెనుకాడటం లేదు.
కుదిరితే పదకొండో స్థానంలో కూడా ఆడిస్తారు
ఒకవేళ అవకాశం గనుక ఉంటే.. పదకొండో స్థానంలో కూడా సంజూను బ్యాటింగ్ చేయమంటారు. ఇలా చేయడం వల్ల ఆటగాడి మనసు గాయపడుతుంది. టాపార్డర్‌లో రాణించినా డిమోట్ చేయడం ఎంతమాత్రం సరికాదు. అయినా.. ఇప్పుడు అతడికి ఇంతకంటే గొప్ప ఆప్షన్ మరొకటి లేదు.
వికెట్ కీపర్‌గానైనా అవకాశం
మౌనంగా అన్నీ భరిస్తూనే యాజమాన్యం చెప్పినట్లు నడుచుకోవాల్సి ఉంటుంది. అయితే, ఆసియాకప్ టోర్నీలో ఐదో స్థానంలో వచ్చి అతడు మెరుగ్గా రాణించాడు. టీ20 ప్రపంచకప్ టోర్నీలో అతడు మొదటి ప్రాధాన్య వికెట్ కీపర్‌గా ఉంటే అంతకంటే మంచి విషయం మరొకటి ఉండదు.
ఐదో నంబర్‌లో సంజూ మరింత మెరుగ్గా రాణిస్తే జట్టులో అతడి స్థానానికి ఢోకా ఉండదు. కాగా ఆసియా కప్‌లో సంజూ ఏడు మ్యాచ్‌లలో కలిపి 125 కంటే తక్కువ స్ట్రైక్‌రేటు నమోదు చేశాడు. అయితే, పాకిస్తాన్‌తో ఫైనల్లో 21 బంతుల్లో 24 పరుగులు చేసి సత్తా చాటాడు. ఇదిలా ఉంటే ఆసీస్- భారత్ మధ్య తొలి టీ20 వర్షం కారణంగా రద్దై పోయింది.
చదవండి: IND vs AUS: అతడి కోసం అర్ష్‌దీప్‌ను బలిచేస్తారా?.. గంభీర్‌పై ఫైర్


