కెప్టెన్ సూర్యతో హెడ్‌కోచ్ గంభీర్ (PC: BCCI)
భారత్ తరఫున అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh). ఈ లెఫ్టార్మ్ సీమర్ ఇప్పటి వరకు ఆడిన 65 మ్యాచ్‌లలో కలిపి 101 వికెట్లు తీశాడు. అంతేకాదు టీమిండియా తరఫున పొట్టి క్రికెట్‌లో అత్యంత వేగంగా వంద వికెట్ల క్లబ్‌లో చేరిన బౌలర్‌గానూ నిలిచాడు.
ఇంతటి ప్రతిభ గల అర్ష్‌దీప్ సింగ్‌ను ఆస్ట్రేలియాతో తొలి టీ20 (IND vs AUS T20)లో పక్కనపెట్టారు. ఆసీస్ టూర్‌లో తొలి రెండు వన్డేల్లో ఈ పేసర్‌ను ఆడించిన యాజమాన్యం.. మూడో వన్డే నుంచి తప్పించింది. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ రాకతో.. అర్ష్‌దీప్‌పై వేటు వేసి హర్షిత్ రాణా (Harshit Rana)కు పెద్దపీట వేసింది. అందుకు తగ్గట్లుగానే నాలుగు వికెట్లు తీసి హర్షిత్ టీమిండియా విజయంలో తన వంతు పాత్ర పోషించాడు.
హర్షిత్ కోసం అతడిని పక్కనపెట్టారు!
అయితే, టీ20 ఫార్మాట్లో అర్ష్‌దీప్ సింగ్‌కు మంచి రికార్డు ఉన్నా.. మరోసారి హర్షిత్ కోసం అతడిని పక్కనపెట్టడం పట్ల విమర్శలు వెల్లువెత్తాయి. టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ తన ప్రియ శిష్యుడు హర్షిత్ కోసం అర్ష్‌ను బలిచేస్తున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందిస్తూ.. ‘‘అర్ష్‌దీప్ సింగ్’’ అంటూ ఒక్క మాటతో మేనేజ్‌మెంట్ తీరును విమర్శించాడు. మరోవైపు.. దేశీ స్టార్ ప్రియాంక్ పాంచల్ కాస్త తీవ్ర స్థాయిలోనే మేనేజ్‌మెంట్ తీరును తప్పుబట్టాడు.
ఎంత వరకు సమంజసం?
‘‘టీ20 ప్రపంచకప్ టోర్నీకి ఇంకా నాలుగు నెలల సమయం కూడా లేదు. అలాంటిది విదేశీ పర్యటనలో తమ అత్యధిక వికెట్ల వీరుడిని పక్కనపెట్టడం ఎంత వరకు సమంజసం? అర్ష్‌దీప్ సింగ్ పట్ల ఇంకాస్త మంచిగా వ్యవహరించండి. అతడు అందుకు అర్హుడు’’ అని ప్రియాంక్ పాంచల్ విమర్శించాడు.

అతడి కోసం అర్ష్‌దీప్‌ను బలిచేస్తారా?
ఇక శ్రీవత్స్ గోస్వామి కూడా అర్ష్‌దీప్ సింగ్‌ను కాదని హర్షిత్ రాణాను తుదిజట్టులోకి తీసుకోవడాన్ని విమర్శించాడు. ఇందుకు గల కారణమేమిటో తనకైతే అంతుపట్టడం లేదన్నాడు. అలాగే రింకూ సింగ్‌ను కూడా జట్టు నుంచి అకారణంగా తప్పించడం ఏమిటోనంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.
కాగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య తొలి టీ20 వర్షార్పణమైంది. చాన్నాళ్లుగా ఫామ్‌లో లేక ఇబ్బంది పడుతున్న టీమిండియా సారథి సూర్యకుమార్ యాదవ్ చక్కటి షాట్‌లతో అలరించినా... భారీ వర్షం కారణంగా మ్యాచ్ సజావుగా సాగలేదు.
వర్షార్పణం
ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం తొలి పోరులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్... 9.4 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 97 పరుగుల వద్ద నిలిచింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (24 బంతుల్లో 39 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (20 బంతుల్లో 37 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకున్నారు.
ఆసియా కప్‌లో అదరగొట్టిన ఓపెనర్ అభిషేక్ శర్మ (14 బంతుల్లో 19; 4 ఫోర్లు) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. నాథన్ ఎల్లిస్ బౌలింగ్‌లో టిమ్ డేవిడ్‌కు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. ఇక 9.4 ఓవర్ల వద్ద ఆటకు అంతరాయం కలిగించిన వర్షం తెరిపినివ్వకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.
ఆసీస్‌తో తొలి టీ20కి భారత తుదిజట్టు
అభిషేక్ శర్మ, శుబ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా.


