క్రికెట్ మైదానంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బంతి తగిలి 17 ఏళ్ల ఆస్ట్రేలియా (Australia) యువ క్రికెటర్ బెన్ ఆస్టిన్ (Ben Austin) మృత్యువాత పడ్డాడు. ప్రీ మ్యాచ్ ప్రాక్టీస్ సందర్భంగా ఈ విషాదం చోటు చేసుకుంది.

మెల్‌బోర్న్‌లోని ఫెర్న్‌ట్రీ గల్లీ క్రికెట్ క్లబ్‌కు ప్రాతినిథ్యం వహించే బెన్.. అక్టోబర్ 29న ఓ టీ20 మ్యాచ్ ఆడాల్సి ఉంది. బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా బౌలర్ సంధించిన ఓ బంతి బెన్ ఛాతీపై బలంగా తాకింది. దీంతో బెన్ స్పృహ తప్పి పడిపోయాడు.
హుటాహుటిన సమీపంలోని అసుపత్రికి తరలించగా.. రెండు రోజుల చికిత్స అనంతరం బెన్ నిన్న తుదిశ్వాస విడిచాడు. అప్పటివరకు తమతో ప్రాక్టీస్ చేసిన బెన్ ఇక లేడని తెలిసి సహచరులు కన్నీరుమున్నీరయ్యారు. బెన్ తల్లిదండ్రులు గుండె పగిలేలా రోధించారు.
బెన్ మరణవార్త యావత్ క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. క్రికెట్ ఆస్ట్రేలియా బెన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. పాపులర్, లవబుల్, గ్రేట్ యంగ్ పర్సన్‌ను కోల్పోయామని ఫెర్న్‌ట్రీ గల్లీ క్రికెట్ క్లబ్ శోకం వ్యక్తం చేసింది.
బెన్ ఉదంతం ఆస్ట్రేలియా యువ క్రికెటర్ ఫిల్ హ్యూస్‌ను (Phil Hughes) గుర్తు చేసింది. హ్యూస్ కూడా 2014లో బెన్ తరహాలోనే మృత్యువాత పడ్డాడు. ఓ దేశవాలీ మ్యాచ్ ఆడుతుండగా ఓ రాకాసి బౌన్సర్ హ్యూస్ తల వెనుక భాగంలో బలంగా తాకింది. అక్కడిక్కడే కుప్పకూలిపోయిన హ్యూస్ రెండు రోజుల పాటు మృత్యువుతో పోరాడి తుదిశ్వాస విడిచాడు. ఈ విషాదం ప్రతిష్టాత్మక సిడ్నీ మైదానంలో జరిగింది.
చదవండి: పంత్ రీఎంట్రీ.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్


