భారత్‌-ఇంగ్లండ్‌ నాలుగో టెస్ట్‌కు ఉగ్ర బెదిరింపులు

Terrorist Gurpatwant Pannun Threatens To Disrupt IND VS ENG Fourth Test At Ranchi - Sakshi

భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య రాంచీ వేదికగా ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్‌కు ఉగ్రవాద బెదింపులు వచ్చాయి. ఈ మ్యాచ్‌కు ఆటంకం కలిగిస్తానని నిషేధిత ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నున్‌ సోషల్‌మీడియాలో ఓ బెదిరింపు వీడియోను పోస్ట్‌ చేశాడు. మ్యాచ్‌కు అంతరాయం కలిగించాలని పన్నున్‌ సీపీఐ మావోయిస్ట్‌ పార్టీకి విజ్ఞప్తి చేశాడు. 

ఈ ఉదంతంతో అలర్ట్‌ అయిన రాంచీ పోలీసులు టెస్ట్‌ మ్యాచ్‌కు భద్రతను కట్టుదిట్టం చేశారు. అదనంగా వెయ్యి మంది పోలీసులను మొహరించినట్లు రాంచీ సీనియర్‌ పోలీస్‌ అధికారి తెలిపారు. పన్నున్‌పై బెదిరింపు కేసును నమోదు చేశారు. రాంచీలోని జేఎస్‌సీఏ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో మ్యాచ్‌ జరుగనుంది. 

ఎవరీ పన్నున్‌..
భారత్‌-ఇంగ్లండ్‌ నాలుగో టెస్ట్‌కు ఆటంకం కలిగిస్తానని బెదిరించిన పన్నున్‌.. కెనడా, అమెరికా దేశాల పౌరసత్వం కలిగిన నిషేధిత ఖలిస్తానీ ఉగ్రవాద నాయకుడు. ఇతను అమెరికా, కెనడా దేశాల్లో ఉంటూ పంజాబ్‌, చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రత్యేక ఖలిస్తాన్‌ పేరుతో అరాచకాలకు పాల్పడుతుంటాడు.

ఇతనిపై యాంటి టెర్రర్‌ ఫెడరల్‌ ఏజెన్సీ 2019లో కేసు నమోదు చేసింది. అప్పటి నుంచి పన్నున్‌ ఎన్‌ఐఏ నిఘాలో ఉన్నాడు. ఫిబ్రవరి 3, 2021న ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టు పన్నున్‌పై నాన్‌ బెయిలబుల్‌ అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది. 2023 నవంబర్‌ 29న పన్నున్‌ను ప్రత్యేక నేరస్థుడిగా ప్రకటించింది.

ఇదిలా ఉంటే, ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ ఆడేందుకు ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్టు భారత్‌లో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లో ఇప్పటికే మూడు టెస్ట్‌ మ్యాచ్‌లు అయిపోయాయి. హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్‌ గెలుపొందగా.. విశాఖలో జరిగిన రెండో టెస్ట్‌, రాజ్‌కోట్‌లో జరిగిన మూడో టెస్ట్‌ల్లో టీమిండియా విజయాలు సాధించింది. ఈ సిరీస్‌లోని నాలుగో టెస్ట్‌ రాంచీలో, ఐదు టెస్ట్‌ ధర్మశాలలో జరగాల్సి ఉంది. ఐదో టెస్ట్‌ మ్యాచ్‌ మార్చి 7 నుంచి ప్రారంభమవుతుంది.

whatsapp channel

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top