
ఆసియా కప్ టీ20 క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొనే భారత పురుషుల క్రికెట్ జట్టు సభ్యులు సెప్టెంబర్ 4న దుబాయ్‌కు చేరుకోనున్నారు. జట్టుగా కాకుండా ఒక్కొక్క ఆటగాడు తమ సొంత నగరాల నుంచి విడివిడిగా దుబాయ్‌కు వెళ్లనున్నారు. సెప్టెంబర్ 4న అందరూ చేరుకున్న తర్వాత 5 నుంచి టీమ్ ప్రాక్టీస్ మొదలవుతుంది.
10న భారత జట్టు ఆతిథ్య యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. సాధారణంగా విదేశాల్లో ఆడేందుకు వెళ్లే ముందు టీమ్ మొత్తం ముంబైలో ఒక్క చోటికి ఒకే సారి ప్రయాణించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈసారి మాత్రం దీనిని మార్చినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
ఆటగాళ్ల సౌకర్యం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు సభ్యుడొకరు వెల్లడించారు. ‘తమ అనుకూలత ప్రకారం కొంత మంది ముంబై నుంచే వెళతారు. కానీ అందరినీ అక్కడికే పిలవడంలో అర్థం లేదు. పైగా ఇతర అంతర్జాతీయ వేదికలతో పోలిస్తే దుబాయ్ స్వల్ప దూరమే.
కాబట్టి అందరికీ తమ ప్రయాణాన్ని ఎంచుకునే అవకాశం కల్పించాం’ అని ఆయన చెప్పారు. ఆసియా కప్‌కు ఎంపికైన 15 మంది సభ్యులు కొందరు ప్రస్తుతం విరామంలో ఉండగా, మరి కొందరు దులీప్ ట్రోఫీ దేశవాళీ టోరీ్నలో ఆడుతున్నారు. ఈ టోర్నీ కోసం స్టాండ్‌బైగా ఎంపికైన క్రికెటర్లు దుబాయ్‌కు వెళతారా లేదా అనే విషయంలో ఇంకా స్పష్టత లేదు.
చదవండి: పొట్టివాళ్లే గొప్ప బ్యాటర్లు... సచిన్, కోహ్లి ఇందుకు ఉదాహరణ: ద్రవిడ్