Ind vs Sl: శ్రీలంకతో మూడో టీ20.. టీమిండియా రికార్డుల మోత!

Team India equalling the record set by Afghanistan - Sakshi

ధర్మశాల వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో టీమిండియా రికార్డుల మోత మోగించింది. అఖరి టీ20లో శ్రీలంకపై 6 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను భారత్‌ 3-0 తేడాతో కైవసం చేసుకుంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. శ్రీలంక బ్యాటర్లలో కెప్టెన్‌ షనకా(74) తప్ప మిగితా ఎవరూ రాణించలేదు. ఇక 147 పరుగల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ 16.5 ఓవర్లలోనే చేధించింది. శ్రేయస్‌ అయ్యర్‌ మరో సారి చెలరేగి ఆడాడు. 45 బంతుల్లో 73 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇక మ్యాచ్‌లో టీమిండియా సాధించిన రికార్డులేంటో పరిశీలిద్దాం.

అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక వరుస విజయాలు సాధించిన జట్లుగా అఫ్గానిస్తాన్, రొమేనియా (12 చొప్పున) పేరిట సంయుక్తంగా ఉన్న ప్రపంచ రికార్డును భారత్‌ సమం చేసింది.

అంతర్జాతీయ టి20ల్లో శ్రీలంకపై భారత్‌కిది 17వ విజయం. ఈ గెలుపుతో టి20ల్లో ఒక జట్టుపై అత్యధిక మ్యాచ్‌ల్లో నెగ్గిన జట్టుగా టీమిండియా రికార్డు నెలకొల్పింది. పాకిస్తాన్‌ పేరిట ఉన్న రికార్డును (జింబాబ్వేపై 16 విజయాలు) భారత్‌ సవరించింది.

అంతర్జాతీయ టి20ల్లో సొంతగడ్డపై భారత్‌కిది 40వ గెలుపు. 39 విజయాలతో న్యూజిలాండ్‌ పేరిట ఉన్న రికార్డును భారత్‌ తిరగరాసింది.

చదవండి: IND vs SL: చరిత్ర సృష్టించిన రోహిత్‌ శర్మ.. ప్రపంచంలో తొలి ఆటగాడిగా

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top