T20 WC 2022: ఎంసీజీ నా హోం గ్రౌండ్‌.. భారత బ్యాటర్లు నన్ను తట్టుకోలేరు! అవునా?!

T20 WC Ind Vs Pak: Haris Rauf Warns Team India MCG My Home Ground - Sakshi

T20 World Cup 2022- India Vs Pakistan: టీ20 ప్రపంచకప్‌-2022 టోర్నీ ఆరంభానికి సమయం ఆసన్నమవుతున్న తరుణంలో పాకిస్తాన్‌ పేసర్‌ హారిస్‌ రవూఫ్‌ తన ప్రణాళికల గురించి వెల్లడించాడు. ముఖ్యంగా టీమిండియాను ఎదుర్కొనేందుకు పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతున్నట్లు తెలిపాడు. భారత బ్యాటర్లను త్వరగా పెవిలియన్‌ చేర్చేందుకు ప్లాన్‌ సిద్ధం చేసుకుంటున్నానన్నాడు.

హారిస్‌ రవూఫ్‌ ప్రస్తుతం స్వదేశంలో ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో బిజీగా ఉన్నాడు. ఇందులో భాగంగా లాహోర్‌ వేదికగా బుధవారం జరిగిన ఐదో మ్యాచ్‌లో అతడు 4 ఓవర్లలో 41 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.

ఎంసీజీ నా హోం గ్రౌండ్‌
ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం మీడియాతో మాట్లాడిన రవూఫ్‌ ఆస్ట్రేలియా వేదికగా జరుగనున్న వరల్డ్‌కప్‌ సన్నాహకాల గురించి చెప్పుకొచ్చాడు. చిరకాల ప్రత్యర్థి టీమిండియాతో పోరు గురించి ప్రస్తావిస్తూ.. ‘‘మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ నా హోం గ్రౌండ్‌ లాంటిది. అక్కడి పిచ్‌లు ఎలా ఉంటాయో నాకు బాగా తెలుసు. 

టీమిండియాను ఎలా ఎదుర్కోవాలో ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నా. నా నైపుణ్యాలకు పదును పెట్టి.. నా బెస్ట్‌ ఇచ్చానంటే వాళ్లు(టీమిండియా బ్యాటర్లు) తట్టుకోవడం కష్టమే. హోం గ్రౌండ్‌లో ఆడనుండటం నాకు సానుకూల అంశంగా మారింది’’ అని రవూఫ్‌ పేర్కొన్నాడు.

కాగా బిగ్‌బాష్‌ లీగ్‌లో మెల్‌బోర్న్‌ స్టార్స్‌కు రవూఫ్‌ ప్రాతినిథ్యం వహిస్త్ను విషయం తెలిసిందే. కాగా అక్టోబరు 16 నుంచి ప్రపంచకప్‌ టోర్నీ ఆరంభం కానుండగా.. అక్టోబరు 23న భారత్‌, పాకిస్తాన్‌ మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ వేదికగా తలపడనున్నాయి.

నీకంత సీన్‌ లేదులే!
ఇక 28 ఏళ్ల రవూఫ్‌ ఇటీవల జరిగిన ఆసియా కప్‌-2022లో భాగంగా రోహిత్‌ సేనతో మొదటి మ్యాచ్‌లో ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. అయితే, సూపర్‌ -4 స్టేజ్‌లో మాత్రం కెప్టెన్‌ రోహిత్‌ శర్మను అవుట్‌ చేసి కీలక వికెట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా రవూఫ్‌ వ్యాఖ్యల నేపథ్యంలో టీమిండియా ఫ్యాన్స్‌ అతడికి కౌంటర్‌ ఇస్తున్నారు.

‘‘నీకంత సీన్‌ లేదు. సొంతగడ్డ మీదే పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నావు. ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నావు. చూద్దాం ఎవరు పైచేయి సాధిస్తారో’’ అంటూ ఇంగ్లండ్‌తో ఐదో టీ20లో అతడి గణాంకాలను ప్రస్తావిస్తూ ట్రోల్‌ చేస్తున్నారు. కాగా ఫాస్ట్‌బౌలర్లకు అనుకూలించే ఆసీస్‌ పిచ్‌లపై రవూఫ్‌నకు మంచి రికార్డే ఉంది. బీబీఎల్‌లో 18 మ్యాచ్‌లలో అతడు 30 వికెట్లు పడగొట్టాడు.

చదవండి: IND vs SA: ధోని రికార్డు బద్దలు కొట్టిన రోహిత్‌.. తొలి భారత కెప్టెన్‌గా
Ind Vs SA T20 Series: బుమ్రా స్థానంలో జట్టులోకి సిరాజ్‌: బీసీసీఐ

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top