టీమిండియా వన్డే వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) గాయం నుంచి కోలుకుంటున్నాడు. అతడి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. త్వరలోనే శ్రేయస్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) సోదరి దీనాల్ యాదవ్ షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అమ్మ.. అయ్యర్ కోసం ప్రార్థిస్తోంది
‘‘అమ్మ.. శ్రేయస్ అయ్యర్ కోసం ప్రార్థిస్తోంది’’ అంటూ దినాల్ ఇన్‌స్టా స్టోరీలో ఓ వీడియోను షేర్ చేసింది. ఛట్ పూజకు వెళ్లిన సూర్య తల్లి స్వప్న యాదవ్.. ‘‘ప్రతి ఒక్కరు శ్రేయస్ అయ్యర్ కోసం ప్రార్థించండి. అతడు క్షేమంగా తిరిగి రావాలని మొక్కుకోండి.
అమ్మ ప్రేమ ఇలాగే ఉంటుంది
శ్రేయస్ ఆరోగ్యం బాగా లేదని తెలిసి నా మనసు ఆందోళనకు గురైంది. అతడు త్వరలోనే ఇంటికి తిరిగి రావాలని దయచేసి అంతా ప్రార్థన చేయండి’’ అని స్వప్న యాదవ్ తన చుట్టూ ఉన్న వాళ్లకు విజ్ఞప్తి చేశారు. ఇది చూసిన నెటిజన్లు.. ‘‘అమ్మ ప్రేమ అంటే ఇలాగే ఉంటుంది.. శ్రేయస్ పట్ల మీ ఆప్యాయత మమ్మల్ని కదిలించింది’’ అంటూ ఉద్వేగానికి లోనవుతున్నారు.
అంతర్గత రక్తస్రావం
కాగా ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా ఆఖరిదైన మూడో వన్డే సందర్భంగా శ్రేయస్ అయ్యర్ గాయపడిన విషయం తెలిసిందే. అలెక్స్ క్యారీ ఇచ్చిన క్యాచ్ అందుకున్న శ్రేయస్.. ఆ వెంటనే నొప్పితో విలవిల్లాడుతూ కుప్పకూలిపోయాడు.
పక్కటెముకలకు తీవ్రమైన గాయం కావడంతో హుటాహుటిన సిడ్నీ హాస్పిటల్‌కు తరలించారు. పరీక్షల్లో అంతర్గత రక్తస్రావం గుర్తించిన ఆస్ట్రేలియా డాక్టర్లు వెంటనే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో ఉంచి చికిత్స అందజేయడంతో కోలుకున్నాడు.
డాక్టర్ల పర్య వేక్షణలోనే
శ్రేయస్ ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఐసీయూ నుంచి ప్రత్యేక గదికి మార్చి తదుపరి చికిత్సను కొనసాగిస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ‘గాయం కచ్చితంగా ఎక్కడైందో గుర్తించి అంతర్గత రక్తస్రావాన్ని నిరోధించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ డాక్టర్ల పర్య వేక్షణలోనే ఉన్నాడు’ అని బోర్డు ఆ ప్రకటనలో పేర్కొంది.
పెద్ద గాయమే అయినా
మరోవైపు.. ఆసీస్‌తో తొలి టీ20కి ముందు సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ‘దేవుడు అయ్యర్ పక్షాన వున్నాడు. అందుకే పెద్ద గాయమే అయినా వేగంగా కోలుకుంటున్నాడు. సిడ్నీ డాక్టర్లు, బోర్డు ప్రత్యేక శ్రద్ద కనబరుస్తున్నారు. త్వరలోనే అతను పూర్తిగా కోలుకుంటాడు’ అని అన్నాడు.
చదవండి: టీమిండియా ‘హెడ్‌కోచ్’తో ఆటగాళ్ల తెగదెంపులు.. వేటు వేసిన బీసీసీఐ!
Suryakumar Yadav’s mother praying for Shreyas Iyer’s recovery during Chhath Puja. 🥺❤️pic.twitter.com/CkYD26lzHo
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 29, 2025


