శ్రీహరి నటరాజ్‌కు స్వర్ణం

Srihari Nataraj falls short of Olympic qualifying mark at Uzbekistan - Sakshi

ఉజ్బెకిస్తాన్‌ ఓపెన్‌ స్విమ్మింగ్‌ టోర్నీ  

తాష్కెంట్‌: ఉజ్బెకిస్తాన్‌ ఓపెన్‌ అంతర్జాతీయ స్విమ్మింగ్‌ టోర్నమెంట్‌లో భారత స్విమ్మర్ల పతకాల వేట కొనసాగుతోంది. గురువారం భారత్‌కు ఎనిమిది పతకాలు లభించాయి. ఇందులో ఐదు స్వర్ణాలు, రెండు రజతాలు, ఒక కాంస్యం ఉంది. పురుషుల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో 20 ఏళ్ల తమిళనాడు స్విమ్మర్‌ శ్రీహరి నటరాజ్‌ స్వర్ణం గెలిచాడు. అతను 54.07 సెకన్లలో రేసును పూర్తి చేసి విజేతగా నిలిచాడు. అయితే శ్రీహరి 0.22 సెకన్లతో టోక్యో ఒలింపిక్స్‌ ‘ఎ’ గ్రేడ్‌ అర్హత ప్రమాణాన్ని (53.85 సెకన్లు) కోల్పోయాడు. 2019 ప్రపంచ జూనియర్‌ చాంపియన్‌షిప్‌లో శ్రీహరి టోక్యో ఒలింపిక్స్‌ గ్రేడ్‌ ‘బి’ అర్హత ప్రమాణాన్ని అందుకున్నాడు. గ్రేడ్‌ ‘ఎ’ ప్రమాణం ఉంటే నేరుగా ఎంట్రీ లభిస్తుంది. ఒకవేళ గ్రేడ్‌ ‘ఎ’ కోటాలో ఖాళీలు మిగిలితే గ్రేడ్‌ ‘బి’ సమయం నమోదు చేసిన వారికి అవకాశం లభిస్తుంది. 
 
మహిళల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో మానా పటేల్‌ (1ని:04.47 సెకన్లు) బంగారు పతకాన్ని గెల్చుకుంది. సువన భాస్కర్‌ ఖాతాలో రజతం చేరింది. పురుషుల 400 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో సజన్‌ ప్రకాశ్‌ (3ని:56.03 సెకన్లు) పసిడి పతకం నెగ్గాడు. ఈ టోర్నీలోని సజన్‌కిది మూడో స్వర్ణం కావడం విశేషం. మహిళల 400 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో శివాని కటారియా స్వర్ణం పొందగా... మహిళల 100 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌లో చాహత్‌ అరోరా బంగారు పతకాన్ని ౖకైవసం  చేసుకుంది. పురుషుల 100 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌ ఈవెంట్‌లో లిఖిత్, ధనుశ్‌ వరుసగా రజతం, కాంస్య పతకాలను సొంతం చేసుకున్నారు.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top