
మరో 69 పరుగుల దూరంలో డబ్ల్యూటీసీ టైటిల్
మార్క్‌రమ్ సెంచరీ
రాణించిన బవుమా
ఆస్ట్రేలియా బౌలర్ల సమష్టి వైఫల్యం
ఐసీసీ టోర్నీల్లో తమ రాత మార్చుకునేందుకు దక్షిణాఫ్రికా సిద్ధమైంది. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో మూడో రోజు అసాధారణ ఆటతో టైటిల్‌కు చేరువైంది. 282 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఎక్కడా తడబడని సఫారీ టీమ్ గెలుపుపై గురి పెట్టింది. పేలవ ప్రదర్శనతో ఆసీస్ బౌలర్లు పూర్తిగా చేతులెత్తేయగా... మార్క్‌రమ్ సెంచరీతో చెలరేగాడు. మరోవైపు కండరాల నొప్పితో బాధపడుతూ కూడా బ్యాటింగ్ కొనసాగించిన కెపె్టన్ తెంబా బవుమా అండగా నిలిచాడు. చేతిలో 8 వికెట్లతో శనివారం మరో 69 పరుగులు సాధిస్తే 27 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీ దక్షిణాఫ్రికా ఖాతాలో చేరుతుంది.
లండన్: వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)లో విజేతగా నిలిచే దిశగా దక్షిణాఫ్రికా అడుగులు వేస్తోంది. లార్డ్స్ మైదానంలో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో సఫారీ టీమ్ డిఫెండింగ్ చాంపియన్ ఆ్రస్టేలియాపై మూడో రోజు సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. 282 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా ఆట ముగిసే సమయానికి 56 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 213 పరుగులు సాధించింది.
మార్క్‌రమ్ (159 బంతుల్లో 102 బ్యాటింగ్; 11 ఫోర్లు) శతకం బాదగా... కెప్టెన్ తెంబా బవుమా (121 బంతుల్లో 65 బ్యాటింగ్; 5 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు ఇప్పటికే అభేద్యంగా 143 పరుగులు జోడించారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 144/8తో ఆట కొనసాగించిన ఆ్రస్టేలియా తమ రెండో ఇన్నింగ్స్‌లో 207 పరుగులకు ఆలౌటైంది. స్టార్క్ (136 బంతుల్లో 58 నాటౌట్; 5 ఫోర్లు) హాఫ్ సెంచరీ సాధించాడు.
చివరి వికెట్‌కు 59 పరుగులు...
మూడో రోజు ఆట ఆరంభంలోనే లయన్ (2)ను రబాడ అవుట్ చేయడంతో ఆసీస్ 9వ వికెట్ కోల్పోయింది. ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎంతో సమయం పట్టదనిపించింది. అయితే స్టార్క్ పట్టుదలగా పోరాడాడు. అతనికి హాజల్‌వుడ్ (53 బంతుల్లో 17; 2 ఫోర్లు) అండగా నిలవడంతో ఆలౌట్ చేసేందుకు సఫారీ బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.
కొన్ని చక్కటి షాట్లు ఆడిన స్టార్క్ 131 బంతుల్లో అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. దీంతో ఆసీస్ స్కోరు కూడా 200 దాటింది. ఎట్టకేలకు మార్క్‌రమ్ బౌలింగ్‌లో హాజల్‌వుడ్ వెనుదిరగడంతో దక్షిణాఫ్రికా ఊపిరి పీల్చుకుంది. స్టార్క్, హాజల్‌వుడ్ 22.3 ఓవర్ల పాటు ఆడి చివరి వికెట్‌కు 59 పరుగులు జోడించడం విశేషం.
శతక భాగస్వామ్యం...
తొలి ఇన్నింగ్స్‌కు భిన్నంగా దక్షిణాఫ్రికా ఆరంభం నుంచే ధాటిగా ఆడింది. 10 ఓవర్లలోనే 47 పరుగులు చేసిన జట్టు రికెల్టన్ (6) కోల్పోయింది. మార్క్‌రమ్, ముల్డర్ (27; 5 ఫోర్లు) ఓవర్‌కు 4 పరుగుల రన్‌రేట్‌తో ధాటిని కొనసాగించారు. లబుషేన్ చక్కటి క్యాచ్‌తో ముల్డర్ వెనుదిరగడంతో ఈ భాగస్వామ్యం ముగిసింది. అయితే ఆ్రస్టేలియా ఆనందం ఇక్కడికే పరిమితమైంది. మార్క్‌రమ్, బవుమా కలిసి సమర్థంగా ఇన్నింగ్స్‌ను నడిపించారు.
ఈ క్రమంలో 69 బంతుల్లోనే మార్క్‌రమ్ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. తీవ్రంగా ఎండ కాయడంతో పిచ్ పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలంగా మారిపోయింది. దాంతో ఆసీస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది. కొద్ది సేపటికి బవుమా 83 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆట ముగియడానికి కొద్దిసేపు ముందు మార్క్‌రమ్ 156 బంతుల్లో సెంచరీతో సగర్వంగా నిలిచాడు.
బవుమా క్యాచ్ పట్టి ఉంటే...
భారీ భాగస్వామ్యానికి ముందు ఒకే ఒక్క సారి ఆసీస్‌కు మరింత పట్టు బిగించే అవకాశం వచ్చింది. 2 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బవుమాకు లైఫ్ లభించింది. స్టార్క్ ఓవర్లో బవుమా ఆడిన షాట్‌కు బంతి మొదటి స్లిప్‌లోకి దూసుకెళ్ళగా క్యాచ్ అందుకోవడంలో స్మిత్ విఫలమయ్యాడు. అయితే నిజానికి అది అంత సులువైన క్యాచ్ కాదు. ఈ టెస్టులో చాలా బంతులు బ్యాట్‌కు తగిలాక స్లిప్ కార్డాన్‌కు కాస్త ముందే పడుతుండటంతో స్మిత్ సాహసం చేస్తూ సాధారణంగా నిలబడే చోటుకంటే కాస్త ముందు వచ్చి నిలబడ్డాడు.
ముందు జాగ్రత్తగా హెల్మెట్ కూడా పెట్టుకున్నాడు. ఊహించినట్లుగానే బంతి చాలా వేగంగా దూసుకొచి్చంది. మరీ దగ్గర కావడం వల్ల స్పందించే సమయం కూడా లేకపోయింది. దాంతో స్మిత్ కుడి చేతి వేలికి బంతి బలంగా తగిలి కింద పడిపోయింది. నొప్పితో విలవిల్లాడిన అతను వెంటనే మైదానం వీడాడు. అనంతరం స్కానింగ్‌లో వేలు విరిగినట్లు తేలింది!
స్కోరు వివరాలు: ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్: 212; దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 138; ఆ్రస్టేలియా రెండో ఇన్నింగ్స్: 207; దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: మార్క్‌రమ్ (బ్యాటింగ్) 102; రికెల్టన్ (సి) కేరీ (బి) స్టార్క్ 6; ముల్డర్ (సి) లబుషేన్ (బి) స్టార్క్ 27; బవుమా (బ్యాటింగ్) 65; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (56 ఓవర్లలో 2 వికెట్లకు) 213. వికెట్ల పతనం: 1–9, 2–70. బౌలింగ్: స్టార్క్ 9–0–53–2, హాజల్‌వుడ్ 13–0–43–0, కమిన్స్ 10–0–36–0, లయన్ 18–3–51–0, వెబ్‌స్టర్ 4–0–11–0, హెడ్ 2–0–8–0.