
పారిస్ ఒలింపిక్స్ తర్వాత తొలిసారి అమీతుమీ
వచ్చే నెల 16న సిలేసియా డైమండ్ లీగ్
సిలేసియా (పోలాండ్): భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా... దాయాది పాకిస్తాన్ జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్‌తో పోటీకి సిద్ధమవుతున్నాడు. వచ్చే నెల 16న పోలాండ్ వేదికగా జరగనున్న సిలేసియా డైమండ్ లీగ్‌లో వీరిద్దరూ బరిలోకి దిగనున్నారు. ఈ మేరకు ప్రపంచ అథ్లెటిక్స్ సమాఖ్య శనివారం వివరాలు వెల్లడించింది. గతేడాది పారిస్ ఒలింపిక్స్‌లో చివరిసారిగా ఈ ఇద్దరు తలపడగా... నదీమ్ జావెలిన్‌ను 92.97 మీటర్ల దూరం విసిరి స్వర్ణం కైవసం చేసుకున్నాడు. నీరజ్ 89.45 మీటర్ల దూరంతో రజతం గెలుచుకున్నాడు.
అంతకుముందు 2020 టోక్యో ఒలింపిక్స్‌లో చోప్రా పసిడి పతకం నెగ్గాడు. ఇటీవల భారత్ వేదికగా తొలిసారి జరిగిన అంతర్జాతీయ జావెలిన్ త్రో ఈవెంట్ ‘నీరజ్ చోప్రా క్లాసిక్’ టైటిల్ గెలిచిన 27 ఏళ్ల నీరజ్ చోప్రా జోరు మీదున్నాడు. ఈ సీజన్‌లో వరుసగా మూడు టైటిల్స్‌తో అతను ఇప్పటికే ‘హ్యాట్రిక్’ నమోదు చేశాడు. ‘నదీమ్, నీరజ్ మధ్య ఆసక్తికర పోరు ఖాయం. పారిస్ ఒలింపిక్స్ తర్వాత ఈ ఇద్దరు ఒకే టోర్నమెంట్‌లో పాల్గొంటుండటం ఇదే తొలిసారి. ఒకరు ప్రపంచ చాంపియన్, మరొకరు ఒలింపిక్ చాంపియన్.
వారి మధ్య సమరాన్ని చూసేందుకు పోలాండ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పాకిస్తాన్ అథ్లెట్ యూరోపియన్ లీగ్‌ల్లో పాల్గొనడం చాలా తక్కువ. మరి ఈ సారి అతడికి నీరజ్‌కు మధ్య పోటీ ఎలా సాగుతుందో చూడాలి’ అని లీగ్ నిర్వాహకులు వెల్లడించారు. ఈ ఏడాది తొలిసారి 90 మీటర్ల మార్క్ దాటిన నీరజ్ చోప్రా... మే నెలలో జరిగిన దోహా డైమండ్ లీగ్‌లో జావెలిన్‌ను 90.23 మీటర్ల దూరం విసిరి తన అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసుకున్నాడు.
పారిస్ ఒలింపిక్స్ తర్వాత వరుసగా టోర్నీల్లో పాల్గొంటున్న నీరజ్ దిగ్గజ కోచ్ జాన్ జెలెజ్నీ దగ్గర శిక్షణ తీసుకుంటున్నాడు. మరోవైపు 28 ఏళ్ల నదీమ్... ఒలింపిక్ చాంపియన్‌గా నిలిచిన అనంతరం కేవలం ఒక్క టోర్నీలో మాత్రమే పాల్గొన్నాడు. సెపె్టంబర్‌లో టోక్యో వేదికగా ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ జరగనున్న నేపథ్యంలో ఈ లీగ్ ప్రాధాన్యత సంతరించుకుంది. 2023లో వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన నీరజ్ దాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు.