Ind Vs SL 2nd Test: చెలరేగిన శ్రేయస్‌ అయ్యర్‌.. తొలి రోజు టీమిండియాదే!

Shreyas iyer, Bumrah, Shami Put India on Top on Day 1 - Sakshi

డే–నైట్‌ టెస్టు మ్యాచ్‌... గులాబీ బంతి అనూహ్యంగా టర్న్‌ అవుతూ, అంచనాలకు మించి బౌన్స్‌ అవుతూ ముల్లులా గుచ్చుకుంటోంది. ఫలితంగా 126 పరుగులకే భారత టాప్‌–5 పెవిలియన్‌కు... ఇలాంటి సమయంలో శ్రేయస్‌ అయ్యర్‌ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆట దిశను మార్చాడు. శతకం సాధించకపోయినా ఎప్పటికీ గుర్తుండిపోయే ఇన్నింగ్స్‌ను జట్టు పరువు నిలిపాడు. ఆపై రాత్రి వాతావరణంలో మన పేసర్లు బంతితో ‘స్వింగాట’ ఆడించారు. దాంతో 30 ఓవర్లకే శ్రీలంక 6 వికెట్లు కోల్పోయి అప్పుడే మ్యాచ్‌లో చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. పరిస్థితి చూస్తే ఈ మ్యాచ్‌ కూడా మూడు రోజుల్లోపే ముగిసేలా ఉంది! 

బెంగళూరు: శ్రీలంకతో రెండో టెస్టులో భారత్‌కు తొలి రోజే పట్టు చిక్కింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 59.1 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది. శ్రేయస్‌ అయ్యర్‌ (98 బంతుల్లో 92; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) సత్తా చాటగా, రిషభ్‌ పంత్‌ (26 బంతుల్లో 39; 7 ఫోర్లు), హనుమ విహారి (81 బంతుల్లో 31; 4 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. అనంతరం లంక ఆట ముగిసే సమయానికి 30 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 86 పరుగులే చేయగలిగింది. మాథ్యూస్‌ (85 బంతుల్లో 43; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించాడు. ప్రస్తుతం ఆ జట్టు మరో 166 పరుగులు వెనుకబడి ఉంది.  

పంత్‌ ఎదురుదాడి... 
పిచ్‌ అనూహ్య రీతిలో స్పందించడంతో భారత బ్యాటర్లు కూడా తడబడ్డారు. ఫలితంగా తక్కువ వ్యవధిలో జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. బౌలర్‌ ఎల్బీ కోసం అప్పీల్‌ చేస్తున్న సమయంలో అనవసరపు సింగిల్‌కు ప్రయత్నించి మయాంక్‌ (4) రనౌట్‌ కాగా, ఒక్కసారిగా పైకి లేచిన బంతిని ఆడలేక రోహిత్‌ శర్మ (15) స్లిప్‌లో క్యాచ్‌ ఇచ్చాడు. విహారి, విరాట్‌ కోహ్లి (23) కొద్దిసేపు పట్టుదలగా నిలబడ్డారు. అయితే 47 పరుగుల భాగస్వామ్యం తర్వాత వీరిద్దరు కూడా వరుస ఓవర్లలో వెనుదిరిగారు. ఈ దశలో పంత్‌ ఎదురుదాడికి దిగాడు. తొలి 7 బంతుల్లోనే 3 ఫోర్లు కొట్టిన అతను టీ విరామం తర్వాత ధనంజయ ఓవర్లో రెండు, జయవిక్రమ ఓవర్లో 3 బౌండరీల చొప్పున బాదాడు.

అయితే ఎంబుల్డెనియా బంతికి అతను క్లీన్‌ బౌల్డ్‌ కాగా... జడేజా (4), అశ్విన్‌ (13), అక్షర్‌ (9) ప్రభావం చూపలేకపోయారు. మరోవైపు నుంచి మాత్రం అయ్యర్‌ అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. ఏ దశలోనూ వెనక్కి తగ్గకుండా ప్రతీ బౌలర్‌పై పైచేసి సాధిస్తూ వన్డే తరహా ఇన్నింగ్స్‌ ఆడాడు. ధనంజయ ఓవర్లో రెండు భారీ సిక్స్‌లతో అయ్యర్‌ 54 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత మరింత దూకుడుగా ఆడి మరో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో అతను సెంచరీకి చేరువయ్యాడు. అయితే ముందుకు దూసుకొచ్చి ఆడే ప్రయత్నంలో స్టంపౌట్‌ కావడంతో ఆ అవకాశం చేజారింది.  

టపటపా... 
ప్రత్యర్థిని కట్టడి చేసిన శ్రీలంకకు ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. బుమ్రా తన వరుస ఓవర్లలో కుశాల్‌ మెండిస్‌ (2), తిరిమన్నె (8)లను అవుట్‌ చేయడంతో లంక పతనం మొదలైంది. తన మొదటి బంతికే కరుణరత్నే (4)ను క్లీన్‌ బౌల్డ్‌ చేసిన షమీ, కొద్ది సేపటికే ధనంజయ (10) పని పట్టాడు. మాథ్యూస్‌ ఒక్కడే పోరాడే ప్రయత్నం చేసినా చివర్లో మళ్లీ బౌలింగ్‌కు వచ్చిన బుమ్రా అతని ఆట ముగించడంతో లంక పేలవంగా తొలి రోజును ముగించింది.

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: మయాంక్‌ (రనౌట్‌) 4; రోహిత్‌ (సి) డిసిల్వా (బి) ఎంబుల్డెనియా 15; విహారి (సి) డిక్‌వెలా (బి) జయవిక్రమ 31; కోహ్లి (ఎల్బీ) (బి) డిసిల్వా 23; పంత్‌ (బి) ఎంబుల్డెనియా 39; అయ్యర్‌ (స్టంప్డ్‌) డిక్‌వెలా (బి) జయవిక్రమ 92; జడేజా (సి) తిరిమన్నె (బి) ఎంబుల్డెనియా 4; అశ్విన్‌ (సి) డిక్‌వెలా (బి) డిసిల్వా 13; అక్షర్‌ (బి) లక్మల్‌ 9; షమీ (సి) డిసిల్వా (బి) జయవిక్రమ 5; బుమ్రా (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (59.1 ఓవర్లలో ఆలౌట్‌) 252.  వికెట్ల పత నం: 1–10, 2–29, 3–76, 4–86, 5–126, 6– 148, 7–183, 8–215, 9–229, 10–252. బౌ లింగ్‌: లక్మల్‌ 8–3–12–1, ఫెర్నాండో 3–0– 18– 0, ఎంబుల్డెనియా 24–2– 94–3, జయ విక్రమ 17.1–3–81–3, ధనంజయ డిసిల్వా 7–1–32–2.  

శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌: కుశాల్‌ మెండిస్‌ (సి) శ్రేయస్‌ (బి) బుమ్రా 2; కరుణరత్నే (బి) షమీ 4; తిరిమన్నె (సి) శ్రేయస్‌ (బి) బుమ్రా 8; మాథ్యూస్‌ (సి) రోహిత్‌ (బి) బుమ్రా 43; ధనంజయ (ఎల్బీ) (బి) షమీ 10; అసలంక (సి) అశ్విన్‌ (బి) అక్షర్‌ 5; డిక్‌వెలా (నాటౌట్‌) 13; ఎంబుల్డెనియా (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (30 ఓవర్లలో 6 వికెట్లకు) 86.  వికెట్ల పతనం: 1–2, 2–14, 3–14, 4–28, 5–50, 6–85. బౌలింగ్‌: బుమ్రా 7–3–15–3, అశ్విన్‌ 6–1–16–0, షమీ 6–1–18–2, జడేజా 6–1–15–0, అక్షర్‌ పటేల్‌ 5–1–21–1. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top