ప్రపంచ రికార్డుతో పసిడి పతకం | Sensational performance by Mukesh and Palak pair | Sakshi
Sakshi News home page

ప్రపంచ రికార్డుతో పసిడి పతకం

Apr 8 2026 1:04 AM | Updated on Apr 8 2026 1:04 AM

Sensational performance by Mukesh and Palak pair

ముకేశ్‌–పలక్‌ జోడీ సంచలన ప్రదర్శన

గ్రనాడా (స్పెయిన్‌):  రైఫిల్, పిస్టల్‌ ప్రపంచకప్‌ టోర్నమెంట్‌ను భారత బృందం పసిడి పతకంతో, ప్రపంచ రికార్డుతో ప్రారంభించింది. మంగళవారం మొదలైన సీజన్‌ తొలి ప్రపంచకప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముకేశ్‌ నేలవల్లి, హరియాణా అమ్మాయి పలక్‌ గులియా అద్భుతం చేశారు. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో ముకేశ్‌–పలక్‌ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలో కొత్త ప్రపంచ రికార్డును కూడా సృష్టించారు. 

42 జోడీలు పోటీపడ్డ క్వాలిఫయింగ్‌ రౌండ్‌లో ముకేశ్‌ (294)–పలక్‌ (287) ద్వయం 581 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో... కియాన్‌జున్‌ యావో–హు కాయ్‌ (చైనా) జోడీ 586 పాయింట్లతో అగ్రస్థానాన్ని సంపాదించి స్వర్ణ–రజత పతక పోరుకు అర్హత సాధించాయి. వెరోనికా–అకోస్‌ కరోలీ (హంగేరి; 580 పాయింట్లు), నటాలియా ప్రాడో–నికోలస్‌ మౌరెర్‌ (అమెరికా; 578 పాయింట్లు) జోడీలు వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచి కాంస్య పతక మ్యాచ్‌కు అర్హత పొందాయి. 

ఫైనల్లో ముకేశ్‌ (244.7 పాయింట్లు)–పలక్‌ (243 పాయింట్లు) జోడీ 487.7 పాయింట్లు స్కోరు చేసి కొత్త ప్రపంచ రికార్డును లిఖించి పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్‌ వేదికగా జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో నిగీనా సైదుకులోవా–ముఖమ్మద్‌ కమలోవ్‌ (ఉజ్బెకిస్తాన్‌; 481.3 పాయింట్లు) నెలకొల్పిన ప్రపంచ రికార్డును ముకేశ్‌–పలక్‌ బద్దలు కొట్టారు. 

కియాన్‌జున్‌ యావో –హు కాయ్‌ (484.8 పాయింట్లు) జోడీ రజత పతకాన్ని గెల్చుకుంది. మరోవైపు 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో భారత్‌కు నిరాశే మిగిలింది. క్వాలిఫయింగ్‌లో సోనమ్‌–గజానన్‌ (భారత్‌; 631.4 పాయింట్లు) జోడీ ఆరో స్థానంలో ... శ్రుతి–అర్ష్ దీప్‌ సింగ్‌ (భారత్‌; 628 పాయింట్లు) జంట 19వ స్థానంలో నిలిచింది.

గురి పెడితే పతకమే...
గుంటూరు జిల్లాకు చెందిన 20 ఏళ్ల ముకేశ్‌ కొన్నాళ్లుగా అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్నాడు. బరిలో దిగిన ప్రతి టోర్నీలో ఏదో ఒక పతకంతో తిరిగొస్తున్నాడు. రెండేళ్ల క్రితం పెరూలో జరిగిన జూనియర్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 25 మీటర్ల పిస్టల్‌ ఈవెంట్‌లో ముకేశ్‌ స్వర్ణం గెలిచి విశ్వవిజేతగా నిలిచాడు. అదే ఈవెంట్‌లో మరో రెండు కాంస్యాలు కూడా సాధించాడు. 

ఈ ఏడాది న్యూఢిల్లీలో జరిగిన జూనియర్‌ ప్రపంచకప్‌లో ముకేశ్‌ స్వర్ణ, రజత, కాంస్య పతకాలు గెలిచాడు. ఈ సంవత్సరమే న్యూఢిల్లీ వేదికగా జరిగిన ఆసియా జూనియర్‌ చాంపియన్‌షిప్‌లో ముకేశ్‌ ఒక స్వర్ణం, రెండు రజతాలు, ఒక కాంస్యం సొంతం చేసుకున్నాడు. సీనియర్‌స్థాయిలో తొలిసారి ప్రపంచకప్‌లో పసిడి పతకంతో ముకేశ్‌ శుభారంభం చేసి తనకెంతో ఉజ్వల భవిష్యత్‌ ఉందని చాటి చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement