భారత క్రికెట్ దిగ్గజం, టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రికి అరుదైన గౌరవం దక్కింది. ముంబైలోని ఐకానిక్ వాంఖడే స్టేడియంలో ఒక స్టాండ్‌కు రవిశాస్త్రి పేరు పెట్టాలని ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) నిర్ణయించింది. గురువారం (ఏప్రిల్ 9) రవిశాస్త్రి పేరిట స్టాండ్‌ను ఘనంగా ఆవిష్కరించనున్నారు.
ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఆయన చేతుల మీదుగా రవిశాస్త్రి స్టాండ్ అధికారికంగా ప్రారంభం కానుంది. కేవలం రవిశాస్త్రి మాత్రమే కాకుండా మరికొందరు దిగ్గజాలను కూడా అదే రోజున ఎంసీఏ సత్కరించనుంది.
భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ డయానా ఎదుల్జీ పేరును వాంఖడే స్టేడియం గేట్‌కు పెట్టనున్నారు. అదేవిధంగా దివంగత దిగ్గజ బ్యాటర్ దిలీప్ సర్దేశాయ్ పేరును కూడా వాంఖడేలోని ఒక గేట్‌కు పెట్టాలని ఎంసీఎ నిర్ణయించింది.
కాగా రవిశాస్త్రి భారత క్రికెట్‌కు నాలుగు దశాబ్ధాల సేవలను అందించాడు. ప్లేయర్‌గా, కోచ్‌గా భారత జట్టు విజయాల్లో భాగమయ్యాడు. 1983 ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా కూడా శాస్త్రి ఉన్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఒకే ఓవర్లో 6 సిక్సర్లు తొలి భారత క్రికెటర్ కూడా శాస్త్రినే కావడం విశేషం. రవిశాస్త్రి తన కెరీర్‌లో 80 టెస్టులు, 150 వన్డేలు ఆడి దాదాపు 7,000 పరుగులు, 280 వికెట్లు తీశారు.


