వైభవ్ సూర్యవంశీ.. విధ్వంసకర బ్యాటింగ్‌కు పెట్టింది పేరు. ఐపీఎల్-2026 సీజన్‌లోనూ వైభవ్ తన భీకర ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. 15 ఏళ్ల వైభవ్ తన సంచలన బ్యాటింగ్‌తో వరల్డ్‌క్లాస్ బౌలర్లను సైతం వణికిస్తున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 15 బంతుల్లోనే సూర్యవంశీ హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.
ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా 31 పరుగులతో సత్తాచాటాడు. ఇప్పుడు మూడో మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, శాంట్నర్ వంటి పవర్‌ఫుల్ బౌలింగ్ ఎటాక్‌ను ఎదుర్కొనేందుకు వైభవ్ సిద్దమయ్యాడు.
మంగళవారం రాజస్తాన్ రాయల్స్ గౌహతి వేదికగా ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. అయితే ఈమ్యాచ్‌కు ముందు బీసీసీఐ మాజీ సెలెక్టర్ జతిన్ పరాంజ్పే కీలక వ్యాఖ్యలు చేశాడు. వైభవ్ సూర్యవంశీ త్వరలోనే ముంబై ఇండియన్స్ తరపున ఆడే అవకాశముందని పరాంజ్పే జోస్యం చెప్పాడు.
"ఈ రోజు వైభవ్ సూర్యవంశీ తన భవిష్యత్తు జట్టుపైనే ఆడబోతున్నాడు. భవిష్యత్తులో ట్రేడింగ్ ద్వారా లేదా వేలంలో భారీ ధరకు వైభవ్‌ను ముంబై సొంతం చేసుకునే అవకాశం ఉందని" అని పరాంజ్పే ఎక్స్ వేదికగా పేర్కొన్నాడు. కాగా గౌహతి వేదికగా రాజస్తాన్-ముంబై మధ్య జరగాల్సిన మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో టాస్ కూడా ఇంకా పడలేదు.
చదవండి: భారత జట్టు ప్రకటన.. వైభవ్ సూర్యవంశీకి నో ఛాన్స్!


