IPL 2021: రాయ్‌ వచ్చాడు... రైజర్స్‌ను గెలిపించాడు | Sakshi
Sakshi News home page

SRH Vs RR: రాయ్‌ వచ్చాడు... రైజర్స్‌ను గెలిపించాడు

Published Tue, Sep 28 2021 4:23 AM

Second win in Sunrisers Hyderabad account IPL 2021 - Sakshi

‘ఇన్ని రోజులు జేసన్‌ రాయ్‌ని తుది జట్టులోకి ఎందుకు తీసుకోలేదు’ రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడి బ్యాటింగ్‌ విన్యాసాలను చూశాక ప్రతి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అభిమానిలో మెదిలిన ప్రశ్న ఇది. సీజన్‌లో హైదరాబాద్‌ మరో విజయాన్ని సాధిస్తే చూడాలన్న అభిమానుల నిరీక్షణకు రాయ్‌ తెరదించాడు. ఆరంభం నుంచే రాజస్తాన్‌ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన అతడు... ఒంటి చేత్తో జట్టును గెలుపు బాటలో నిలబెట్టాడు.

దుబాయ్‌: ఐపీఎల్‌లో ఎదురవుతున్న వరుస పరాజయాలకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫుల్‌స్టాప్‌ పెట్టింది. రాజస్తాన్‌ రాయల్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో నెగ్గిన హైదరాబాద్‌ తమ ఖాతాలో రెండో విజయాన్ని జమ చేసుకుంది. తొలుత రాజస్తాన్‌ రాయల్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. కెప్టెన్‌ సంజూ సామ్సన్‌ (57 బంతుల్లో 82; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) మరోసారి చెలరేగాడు. యశస్వి జైస్వాల్‌ (23 బంతుల్లో 36; 5 ఫోర్లు, 1 సిక్స్‌), మహిపాల్‌ లొమ్రోర్‌ (28 బంతుల్లో 29 నాటౌట్‌; 1 ఫోర్, 1 సిక్స్‌) రాణించారు. సిద్ధార్థ్‌ కౌల్‌ రెండు వికెట్లు తీశాడు. ఛేజింగ్‌లో హైదరాబాద్‌ 18.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసి గెలిచింది. వార్నర్‌ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ జేసన్‌ రాయ్‌ (42 బంతుల్లో 60; 8 ఫోర్లు, 1 సిక్స్‌) గెలుపు బాటకు పునాది వేయగా... కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (41 బంతుల్లో 51 నాటౌట్‌; 5 ఫోర్లు, 1 సిక్స్‌) ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చాడు.  

రాయ్‌ విధ్వంసం... 
హైదరాబాద్‌ తరఫున తొలి ఐపీఎల్‌ మ్యాచ్‌ ఆడిన జేసన్‌ రాయ్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. దొరికిన బంతిని దొరికినట్లు స్టాండ్స్‌లోకి పంపి స్కోరు బోర్డును రాకెట్‌ వేగంతో నడిపించాడు. ముస్తఫిజుర్‌ బౌలింగ్‌లో రెండు ఫోర్లు బాదిన అతడు... మోరిస్‌ బౌలింగ్‌లో మూడు బౌండరీలు బాదాడు. మరో ఎండ్‌లో వృద్ధిమాన్‌ సాహా (18; 2 ఫోర్లు, 1 సిక్స్‌) కూడా దూకుడుగా ఆడాడు. దాంతో వీరు తొలి వికెట్‌కు 57 పరుగులు జోడించారు. 11వ ఓవర్‌ వేయడానికి వచ్చిన తెవాటియా బౌలింగ్‌లో విశ్వరూపం ప్రదర్శించిన రాయ్‌... 6, 4, 4, 4 కొట్టి 36 బంతుల్లో అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. విలియమ్సన్‌ కూడా అడపాదడపా బౌండరీలు సాధించడంతో హైదరాబాద్‌ 11వ ఓవర్‌లో 100 పరుగుల మార్కును అందుకుంది. అయితే రాయ్‌ని సకారియా పెవిలియన్‌కు చేర్చగా... ప్రియమ్‌ గార్గ్‌ (0) ‘గోల్డెన్‌ డక్‌’గా వెనుదిరిగాడు. అనంతరం రాజస్తాన్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో హైదరాబాద్‌ పరుగులను రాబట్టలేకపోయింది. విజయ సమీకరణం 18 బంతుల్లో 22 పరుగు లుగా ఉన్న సమయం లో... అభిషేక్‌ శర్మ సిక్సర్‌ బాది ఒత్తిడి తగ్గించాడు. 19వ ఓవర్‌లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన విలియమ్సన్‌... ఫిఫ్టీని పూర్తి చేసుకోవడంతోపాటు జట్టుకు విజ యాన్ని కూడా అందిం చాడు. గురువారం జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో చెన్నై తో హైదరాబాద్‌ ఆడుతుంది. 

స్కోరు వివరాలు
రాజస్తాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌: లూయిస్‌ (సి) సమద్‌ (బి) భువనేశ్వర్‌ 6; యశస్వి జైస్వాల్‌ (బి) సందీప్‌ శర్మ 36; సామ్సన్‌ (సి) హోల్డర్‌ (బి) కౌల్‌ 82; లివింగ్‌స్టోన్‌ (సి) సమద్‌ (బి) రషీద్‌ 4; లొమ్రోర్‌ (నాటౌట్‌) 29; పరాగ్‌ (సి) రాయ్‌ (బి) కౌల్‌ 0; తెవాటియా (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 164. వికెట్ల పతనం: 1–11, 2–67, 3–77, 4–161, 5–162. బౌలింగ్‌: సందీప్‌ శర్మ 3–0–30–1, భువనేశ్వర్‌ 4–1– 28–1, హోల్డర్‌ 4–0–27–0, కౌల్‌ 4–0–36–2, రషీద్‌ ఖాన్‌ 4–0–31–1, అభిషేక్‌ 1–0–8–0. 
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: జేసన్‌ రాయ్‌ (సి) సామ్సన్‌ (బి) సకారియా 60; సాహా (స్టంప్డ్‌) సామ్సన్‌ (బి) లొమ్రోర్‌ 18; విలియమ్సన్‌ (నాటౌట్‌) 51; గార్గ్‌ (సి అండ్‌ బి) ముస్తఫిజుర్‌ 0; అభిషేక్‌ శర్మ (నాటౌట్‌) 21; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (18.3 ఓవర్లలో 3 వికెట్లకు) 167. వికెట్ల పతనం: 1–57, 2–114, 3–119. బౌలింగ్‌: ఉనాద్కట్‌ 2–0–20–0, మోరిస్‌ 3–0–27–0, ముస్తఫిజుర్‌ 3.3–0–26–1, లొమ్రోర్‌ 3–0–22–1, తెవాటియా 3–0–32–0, సకారియా 4–0–32–1. 

Advertisement
Advertisement