చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీపై వస్తున్న ఊహాగానాలకు స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ ఎట్టకేలకు తెరదించాడు. ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు రాజస్థాన్ రాయల్స్ నుంచి సీఎస్‌కేలో చేరిన తర్వాత, అతడే జట్టు కొత్త కెప్టెన్ అవుతాడనే వార్తలు బలంగా వినిపించాయి. అయితే తాజాగా ఈ అంశంపై సంజూ స్పష్టమైన ప్రకటన చేశాడు. తాను ఎప్పుడూ కెప్టెన్సీ గురించి ఆలోచించలేదని తెలిపాడు. కొత్త జట్టులోకి వెళ్లేటప్పుడు డిమాండ్లతో వెళ్లకూడదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
“నేను ఇప్పటికే ఒక జట్టులో కెప్టెన్‌గా ఉన్నాను. అక్కడి నుంచి కొత్త జట్టుకు వచ్చాను. అలాంటి సమయంలో కెప్టెన్సీ గురించి ఆలోచించడం సరైంది కాదు. కొత్త ఇంట్లోకి వెళ్తే ముందుగా ఆ ఇంటి మనిషిలా కలిసిపోవాలి” అని అన్నాడు.
అదే సమయంలో ప్రస్తుత సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌పై ప్రశంసలు కురిపించాడు. రుతురాజ్ చాలా నిశ్శబ్దంగా కనిపించినా, అతడిలో అపారమైన ఆత్మవిశ్వాసం ఉందని పేర్కొన్నాడు. సీఎస్‌కేలో చేరేందుకు తనను స్వయంగా రుతురాజ్ సంప్రదించాడని, అది తనకు ఎంతో నచ్చిందని తెలిపాడు.
“రుతు భారత క్రికెట్‌లో చాలా భిన్నమైన స్టార్. అతను పెద్ద ఫ్రాంచైజీకి నాయకత్వం వహిస్తున్నా, ఎలాంటి అహంకారం ఉండదు. మాటలకంటే చర్యలతో చూపించే వ్యక్తి” అంటూ సంజూ కొనియాడాడు.
కాగా, 2024లో సీఎస్‌కే కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన రుతురాజ్‌కు ఇప్పటివరకు కఠిన ప్రయాణమే ఎదురైంది. 2024లో జట్టు ప్లేఆఫ్స్‌కు తృటిలో దూరమవగా, 2025లో గాయం కారణంగా సీజన్ మధ్యలోనే తప్పుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ సీఎస్‌కే యాజమాన్యం అతడిపైనే నమ్మకం ఉంచింది.
ప్రస్తుత సీజన్ విషయానికొస్తే.. సీజన్ ప్రారంభంలో సీఎస్‌కే ఘోరంగా విఫలమైనా, ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుంది. ప్లే ఆఫ్స్ బెర్త్‌కు ప్రధాన పోటీదారుగా మారింది. ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. తదుపరి ఆడబోయే 4 మ్యాచ్‌ల్లో మూడు గెలిచినా, సీఎస్‌కే ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారైనట్లే. ఈ జట్టు పరివర్తనలో సంజూ శాంసన్ కీలకపాత్ర పోషించాడు. రెండు శతకాలు, ఓ అర్ద శతకం సాధించి సీఎస్‌కే విజయాలకు ప్రధాన కారకుడయ్యాడు.


