ఐపీఎల్‌ అదరహో...

Sakshi Special Story On IPL 2020

విజయవంతంగా ముగిసిన మెగా టోర్నీ

ప్రేక్షకులు లేకున్నా తగ్గని ఆకర్షణ

టీవీల ద్వారా వినోదం పంచిన ఆటగాళ్లు   

ప్రతీ ఐపీఎల్‌కు ఒక కథ ఉంటుంది... ఈ సారి ఐపీఎల్‌ది అన్నింటికంటే భిన్నమైన కథ... కరోనా ఐపీఎల్‌ను ఆపేస్తుందని అంతా అనుకున్నారు. కానీ అస్సలు జరగలేదు... ఖాళీ స్టేడియాలు బోర్‌ కొట్టిస్తాయని అంతా అనుకున్నారు. అయితే అదీ జరగలేదు... చెన్నై క్వాలిఫై కావడమనేది సహజసిద్ధమైన నిబంధన... కానీ అలా కూడా జరగలేదు. పది రోజుల ముందే ప్లే ఆఫ్స్‌ స్థానాలు ఖరారవుతాయని అనిపించింది. ఏమాత్రం అలా జరగలేదు... 224 పరుగులు చేస్తే గెలుపు ఖాయమనిపించింది.

చివరకు ఇది కూడా సాధ్యం కాలేదు... ఒక సూపర్‌ ఓవర్‌తో ఫలితం వస్తుందని అనిపించింది. కానీ అదీ సరిపోలేదు.... అయితే ఇవన్నీ జరగకపోయినా ఒకటి మాత్రం కచ్చితంగా జరిగింది. అదే ఐపీఎల్‌ సూపర్‌ హిట్‌... విజేత, పరాజితుల గురించి పక్కన పెడితే అభిమానులను అలరించడంలో మాత్రం లీగ్‌ ఎక్కడా తగ్గలేదు. కోవిడ్‌–19 సమయంలో అభిమానులకు ఈ టోర్నీ పూర్తి వినోదాన్ని పంచిందనడంలో సందేహం లేదు. ఐపీఎల్‌–2020లో కొన్ని విశేషాలను చూస్తే...  

తాజా సీజన్‌లోనూ కొన్ని వివాదాలు ఐపీఎల్‌ను తాకాయి. అయితే అవేవీ పెద్ద సమస్యగా మారకుండా టీ కప్పులో తుఫాన్‌ తరహాలాంటివే కావడం వల్ల లీగ్‌ పేరుకు నష్టం వాటిల్లలేదు. పూర్తి వివరాలు తెలియకపోయినా... ‘బాల్కనీ’ గది ఇవ్వకపోవడం వల్లే సురేశ్‌ రైనా ఐపీఎల్‌ నుంచి వెళ్లిపోయినట్లు వార్తలు రావడం, దిగ్గజ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌ వ్యాఖ్యలు స్పష్టంగా వినకుండా తన గురించి తప్పుగా మాట్లాడారంటూ అనుష్క శర్మ ఆగ్రహం వ్యక్తం చేయడంలాంటివి జరిగాయి. గత ఐపీఎల్‌లో ‘మన్కడింగ్‌’తో వివాదం రేపిన అశ్విన్‌... ఈసారి అలా చేయకుండా ఫించ్‌ను హెచ్చరికతో వదిలేయడం కూడా వివాదం కాని వార్తగా నిలిచింది. ఢిల్లీతో మ్యాచ్‌కు ముందు ముంబై అధికారిక ట్విట్టర్‌లో ఢిల్లీ 163/5 పరుగులు చేస్తుందంటూ ట్వీట్‌ ఉండటం... ఢిల్లీ చివరకు దాదాపు అంతే స్కోరు (162/4) చేయడం కొంత చర్చకు దారి తీసింది.  

ఐపీఎల్‌–2020 వెలుగులకు కాస్త అడ్డుపడిన విషయం అంపైరింగ్‌ ప్రమాణాలు. ఈసారి లీగ్‌లో పెద్ద సంఖ్యలో అంపైరింగ్‌ నిర్ణయాలు తప్పులుగా తేలడమే కాదు... పలు సందర్భాల్లో వివాదంగా కూడా మారాయి. ఢిల్లీతో మ్యాచ్‌లో పంజాబ్‌ తీసిన సింగిల్‌ను ‘షార్ట్‌ రన్‌’గా పరిగణించడం, చివరకు అదే ఫలితానికి కారణం కావడంతో అంపైరింగ్‌ వివాదాలు మొదలయ్యాయి. లీగ్‌ నుంచి నిష్క్రమించిన రోజున కూడా కేఎల్‌ రాహుల్‌ దీని గురించి మాట్లాడాడంటే దాని ప్రభావం వారిని ఎంతగా వెంటాడిందో అర్థమవుతుంది. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముజీబ్‌ అవుట్‌ కూడా వింతగా మారింది. క్యాచ్‌ పట్టినట్లు తేల్చి మూడో అంపైర్‌ అవుట్‌గా ప్రకటించడం, ఆ తర్వాత ముజీబ్‌ మళ్లీ రివ్యూ కోరడం అంతా గందరగోళంగా కనిపించింది.

చెన్నైతో మ్యాచ్‌లో రాజస్తాన్‌ బ్యాట్స్‌మన్‌ టామ్‌ కరన్‌ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చినట్లు అంపైర్‌ ముందుగా ప్రకటించాడు. అయితే టామ్‌ సందేహం వెలిబుచ్చడంతో అంపైర్లు మళ్లీ థర్డ్‌ అంపైర్‌ను సంప్రదించి నాటౌట్‌గా తేల్చారు. నిజానికి అప్పటికే రివ్యూ వాడేసిన రాజస్తాన్‌ మళ్లీ రివ్యూ కోరడం కెప్టెన్‌ ధోనికి కోపం తెప్పించింది. ఆ తర్వాత హైదరాబాద్‌తో మ్యాచ్‌లో కూడా అంపైర్‌ పాల్‌ రీఫెల్‌ వైడ్‌ను ప్రకటించేందుకు సిద్ధమై... ధోని ఆగ్రహ చూపులతో వెనక్కి తగ్గడం కూడా తీవ్ర ఆశ్చర్యం కలిగించింది. ఎలిమినేటర్‌లో వార్నర్‌ విషయంలో కూడా రీప్లేలో ఎలాంటి స్పష్టత లేకపోయినా మూడో అంపైర్‌ అవుట్‌గా ప్రకటించడం చర్చకు దారి తీసింది.  

ఈ సీజన్లో ఆ జట్టు, ఈ జట్టు అని తేడా లేకుండా అభిమానులను అన్నింటికంటే ఆనందపర్చిన విషయం వర్షం లేకపోవడం! వానలకు కొరత ఉండే ఎడారి దేశంలో టోర్నీ జరగడంతో ఒక్క మ్యాచ్‌కు కూడా వర్షం అడ్డంకిగా మారలేదు. మ్యాచ్‌ మాత్రమే కాదు... కనీసం ఒక్క బంతి కూడా వరుణదేవుడి కారణంగా వృథా కాలేదు. 60 మ్యాచ్‌లలో మొత్తం ఓవర్లు సజావుగా సాగడం... పైగా సొంత మైదానాలు కాకపోవడంతో ఏ జట్టుకూ ప్రత్యేకంగా అనుకూలత లేకపోవడం వల్ల యూఏఈలో జరిగిన ఐపీఎల్‌ అన్నింటికంటే హోరాహోరీగా, ఆసక్తికరంగా సాగిందనడంలో సందేహం లేదు.   

► టోర్నీ ఆరంభంలోనే కేఎల్‌ రాహుల్‌ అద్భుత సెంచరీతో (69 బంతుల్లో 132 నాటౌట్‌) మెరిశాడు. ఐపీఎల్‌ చరిత్రలో ఒక భారత ఆటగాడు సాధించిన అత్యధిక స్కోరు ఇదే. ఈసారి లీగ్‌లో మొత్తం 5 శతకాలు నమోదయ్యాయి.  

► పంజాబ్‌పై రాహుల్‌ తేవటియా(రాజస్తాన్‌) ఇన్నింగ్స్‌ మరచిపోలేనిది. ఏమాత్రం గెలుపు అవకాశం లేని మ్యాచ్‌లో అతను అద్భుతంగా ఆడి అందరినీ ఆశ్చర్యపరిచాడు. కాట్రెల్‌ ఓవర్లో 5 సిక్సర్లు బాదడం హైలైట్‌గా నిలిచింది. అప్పటి వరకు అనామకుడిగా ఉన్న తేవటియాను ఈ ఇన్నింగ్స్‌ హీరోను చేసింది.  

► ముంబై, పంజాబ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ‘డబుల్‌’ సూపర్‌ ఓవర్‌ నమోదు కావడం మరచిపోలేనిది. ఇరు జట్లు 176 పరుగులు చేయగా, తొలి సూపర్‌ ఓవర్లో కూడా సమానంగా 5 పరుగులే చేశాయి. రెండో సూపర్‌ ఓవర్లో ముంబై 11 పరుగులు చేయగా, పంజాబ్‌ 15 పరుగులు సాధించి గెలిచింది. అంతకుముందు అదే రోజు హైదరాబాద్, కోల్‌కతా మధ్య మ్యాచ్‌లో కూడా సూపర్‌ ఓవర్‌ ద్వారానే ఫలితం తేలింది.  

► ముంబై ఇండియన్స్‌ 195 పరుగులు చేశాక మ్యాచ్‌పై ప్రత్యర్థి ఆశలు వదులుకోవాల్సిందే... కానీ వరల్డ్‌ నంబర్‌వన్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ అద్భుతమైన ఆటతో మ్యాచ్‌ను రాజస్తాన్‌ రాయల్స్‌ పరం చేశాడు. ఛేదనలో అతను 60 బంతుల్లోనే అజేయంగా 107 పరుగులు చేయడం అనూహ్యం.

► ఐపీఎల్‌ చరిత్రలో వరుసగా రెండు సెంచరీలు సాధించిన తొలి ఆటగాడిగా శిఖర్‌ ధావన్‌ నిలిచాడు. ముందుగా చెన్నైపై అజేయంగా 101 పరుగులు చేసిన అతను, తర్వాతి మ్యాచ్‌ లో పంజాబ్‌పై 106 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు  

► కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మొహమ్మద్‌ సిరాజ్‌ సంచలన బౌలింగ్‌ ప్రదర్శన (3/8) నమోదు చేశాడు. లీగ్‌ చరిత్రలో రెండు మెయిడిన్‌ ఓవర్లు వేసిన తొలి బౌలర్‌గా నిలిచాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top