ధోని రిటైర్మెంట్‌పై భార్య సాక్షి భావోద్వేగ పోస్ట్‌

Sakshi Singh Reacts On MS Dhoni Retirement

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారు. తన అభిమానుల కోసం పంచుకున్న సందేశంలో మీ నుంచి ఎల్లప్పుడూ లభించే ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు అని సోషల్ మీడియాలో ధోనీ రాశారు. శనివారం(15-08-2020) సాయంత్రం 07.29 తర్వాత తాను పదవీ విరమణ చేసినట్లు గుర్తించండి అని పేర్కొన్నాడు. ధోని రిటైర్మెంట్ తర్వాత పలువురు స్పందించారు. కొందరు ఆయనతో కలిసి నడిచిన కాలాన్ని గుర్తుచేసుకోగా... మరికొందరు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే ధోనీ ఘనతల్ని గుర్తు చేసుకుంటూ ఫొటోలు, వీడియోల్ని ట్విటర్‌లో షేర్ చేస్తున్నారు. అభిమానులే కాదు.. ధోనీ సహచర క్రికెటర్లు కూడా అతనితో తమకి ఉన్న జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు. 
(చదవండి : రిటైర్మెంట్‌ ప్రకటించిన మిస్టర్‌ కూల్‌..)

ఇక ధోని రిటైర్మెంట్‌పై ఆయన సతీమణి సాక్షిసింగ్‌ కూడా స్పందించారు. దేశం గర్వపడేలా ఎన్నో విజయాలను ధోని అందిచాడని, ప్రజలు వాటిని మర్చిపోతారు కాని ఆ క్షణంలో వారికి ఆయన అందించిన అనుభూతిని మర్చిపోలేనిదని ఇన్‌స్ట్రాగ్రామ్‌లో చెప్పుకొచ్చారు. 

‘మీరు సాధించిన విజయాలను చూసి గర్వపడాలి. రిటైర్మెంట్‌ ప్రకటించినందుకు అభినందనలు. మీరు సాధించిన విజయాలను చూసి నేను గర్విస్తున్నాను. మీకిష్టమైన ఆటకు గుడ్‌బై చెప్పే క్రమంలో మీరు పడిన మనోవేదన నాకు తెలుసు. కన్నీళ్లను దిగమింగుకొని రిటైర్మెంట్‌ ప్రకటించారని అనుకుంటున్నాను. మీరు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీరు చెప్పిన మాటలు, చేసిన పనిని ప్రజలు మర్చిపోతారేమో కానీ, వాళ్లకు అందించిన అనుభూతిని ఎప్పుడూ మర్చిపోలేరు’అని సాక్షిసింగ్‌ ధోని పేర్కొన్నారు. (చదవండి : మహేంద్రుడి మాయాజాలం)

దాదాపు 16 ఏళ్ళ పాటు టీం ఇండియాకు మహీ సేవలు అందించాడు. మూడు ఫార్మాట్లలో కూడా టీం ఇండియాకు ధోనీ అన్ని విధాలుగా తన బాధ్యతలు నిర్వహించి మంచి విజయాలు అందించాడు. 2007లో టి20 ప్రపంచ కప్, ఆ తర్వాత భారత అభిమానులంతా కలలు గన్న వన్డే వరల్డ్‌ కప్‌ (2011)తో పాటు 2013లో చాంపియన్‌ ట్రోఫీని కూడా సాధించి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. మూడు ఐసీసీ టోర్నీలను గెలిచిన ఏకైక కెప్టెన్‌గా నిలిచిపోయాడు. ప్రస్తుతం ధోనీ ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి నవంబర్‌ 10వరకు ఐపీఎల్ 2020 జరుగనున్న సంగతి తెలిసిందే.

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top