రిటైర్మెంట్‌ ప్రకటించిన మిస్టర్‌ కూల్‌..

Mahendra Singh Dhoni Announced About His Retirement From International Cricket - Sakshi

అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన మాజీ కెప్టెన్‌ 

ఐపీఎల్‌లో కొనసాగనున్న మిస్టర్‌ కూల్‌..  

అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన ధోని 

గత వరల్డ్‌ కప్‌లో చివరి మ్యాచ్‌ ఆడిన మాజీ కెప్టెన్‌

‘మిస్టర్‌ కూల్‌’ మళ్లీ టీమిండియా జెర్సీలో కనిపించడు... భారత క్రికెట్‌ను అత్యున్నత స్థాయికి చేర్చిన నాయకుడిని ఇక అంతర్జాతీయ ఆటలో చూసే అవకాశం మళ్లీ రాదు... అద్భుత విజయాలు సాధించినా, పరాజయపు అవమానాలు ఎదుర్కొన్నా ఒకే తరహాలో స్థితప్రజ్ఞత చూపించిన మహేంద్ర సింగ్‌ ధోని తన ఆటను ముగిస్తున్నట్లు ప్రకటించాడు. 16 ఏళ్ల కెరీర్‌కు వీడ్కోలు పలుకుతూ తప్పుకుంటున్నట్లు వెల్లడించాడు. గత ఏడాది జరిగిన వన్డే వరల్డ్‌ కప్‌ సెమీ ఫైనల్లో న్యూజిలాండ్‌తో ధోని తన చివరి మ్యాచ్‌ ఆడాడు. ఆ తర్వాత ఏడాది కాలంగా అతను జట్టుకు దూరంగా ఉంటూ ఏ స్థాయి క్రికెట్‌లో కూడా ఆడలేదు.

ఈ ఏడాది టి20 ప్రపంచకప్‌ ఆడవచ్చని ఇటీవలి వరకు వినిపించినా...కరోనా కారణంగా ఈ టోర్నీ ఏడాది పాటు వాయిదా పడటంతో ఇక తప్పుకునేందుకు సరైన సమయంగా ఎమ్మెస్‌ భావించాడు. ఇప్పుడు ఐపీఎల్‌ మాత్రం మహి మెరుపులు చూసేందుకు అవకాశం ఉంది. 350 వన్డేల్లో ధోని 50.57 సగటుతో 10,773 పరుగులు సాధించాడు. ఇందులో 10 సెంచరీలు, 73 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 98 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లలో 37.60 సగటుతో అతను 1,617 పరుగులు చేశాడు. 2007లో టి20 ప్రపంచకప్, 2011లో వన్డే వరల్డ్‌ కప్, 2013లో వన్డే చాంపియన్స్‌ ట్రోఫీని గెలిపించిన ధోని మూడు ఐసీసీ టోర్నీలు సాధించిన ఏకైక కెప్టెన్‌గా నిలవడం విశేషం. ధోని 2014 డిసెంబర్‌లోనే టెస్టు క్రికెట్‌ నుంచి తప్పుకున్నాడు. 

ఏడాది విరామమిచ్చి... 
గత సంవత్సర కాలంలో ధోని రిటైర్మెంట్‌పై ఎన్నో ఊహాగానాలు వచ్చాయి. వన్డే ప్రపంచ కప్‌లో సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ తర్వాత అతను మళ్లీ క్లబ్‌ స్థాయి క్రికెట్‌ కూడా ఆడలేదు. అయితే అంతర్జాతీయ క్రికెట్‌నుంచి తప్పుకోవడంపై తన వైపు నుంచి ఎలాంటి స్పష్టత లేకపోగా సెలక్టర్లు కూడా నేరుగా ఎలాంటి సమాధానం ఇవ్వకుండా దాటవేత ధోరణిని అవలంబించారు. ఆ సమయంలో పరిస్థితి చూస్తే అతను కచ్చితంగా ఆస్ట్రేలియాలో టి20 ప్రపంచ కప్‌ ఆడతాడని అనిపించింది. కెప్టెన్‌ కోహ్లి మాటలు వింటున్నప్పుడు కూడా వరల్డ్‌ కప్‌లో ధోని అనుభవం అక్కరకు వస్తుందనే భావం కనిపించింది. అయితే కరోనా వచ్చి అంతా మార్చేసింది.

ఇప్పుడు ప్రత్యేక పరిస్థితుల్లో యూఏఈలో ఐపీఎల్‌ జరుగుతున్నా... దాని వల్ల ధోనికి వ్యక్తిగతంగా పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. టి20 వరల్డ్‌ కప్‌ 2021 నవంబర్‌కు వాయిదా పడింది. అప్పటి వరకు అంటే సంవత్సర కాలం పాటు ఆటను, ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడంతో పాటు టీమిండియా సభ్యుడిగా ఉండే ఒత్తిడిని ఎలాగూ భరించాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితి చూస్తే ఆటగాడిగా ధోని కొత్తగా సాధించాల్సిన విజయాలు, అందుకోవాల్సిన లక్ష్యాలులాంటివి ఏమీ లేవు. సరిగ్గా చూస్తే గత సంవత్సర కాలంలో ఎప్పుడైనా ధోని రిటైర్‌ కావచ్చని వినిపించింది. కానీ అతను మాత్రం తనదైన శైలిలో చివరి బంతి వరకు మ్యాచ్‌ను తీసుకెళ్లినట్లుగా ఇప్పుడు అధికారికంగా రిటైర్మెంట్‌ను ప్రకటించాడు.   

రనౌట్‌తో మొదలై రనౌట్‌తో ముగించి... 
చిట్టగాంగ్‌లో బంగ్లాదేశ్‌తో ఆడిన తన తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లో ఏడో స్థానంలో బరిలోకి దిగిన ధోని ఒకే ఒక బంతిని ఎదుర్కొని ‘సున్నా’కే రనౌట్‌గా వెనుదిరిగాడు. న్యూజిలాండ్‌తో ఆడిన ఆఖరి వన్డేలో కూడా 50 పరుగులు చేసిన అనంతరం గప్టిల్‌ అద్భుత త్రోకు అతను రనౌట్‌ అయ్యాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top