ఐపీఎల్-2026 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ తిరిగి గెలుపు బాట పట్టింది. చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో గుజరాత్ ఘన విజయం సాధించింది. సీఎస్‌కే నిర్ధేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ 16.4 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది.
గుజరాత్ ఓపెనర్ సాయిసుదర్శన్(46 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లతో 87) మరోసారి సత్తాచాటాడు. అతడితో పాటు జోస్ బట్లర్(39 నాటౌట్), శుభ్‌మన్‌గిల్(33)రాణించారు. సీఎస్‌కే బౌలర్లలో ఆకిల్ హోస్సేన్, నూర్ అహ్మద్ తలా వికెట్ పడగొట్టారు.
రుతురాజ్ కెప్టెన్ ఇన్నింగ్స్
అంతకముందు బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. శాంసన్, బ్రెవిస్ వంటి స్టార్ ప్లేయర్లు ఆరంభంలోనే ఔటైనప్పటికి.. రుతురాజ్ మాత్రం ఆచితూచి ఆడుతూ జట్టుకు గౌరప్రదమైన స్కోర్‌ను అందించాడు.
60 బంతులు ఎదుర్కొన్న గైక్వాడ్.. 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 74 పరుగులు చేశాడు. అతడితో పాటు ఓవర్టన్(6 బంతుల్లో 18) దూకుడుగా ఆడాడు. గుజరాత్ బౌలర్లలో రబాడ మూడు, అర్షద్ ఖాన్, సుత్తార్, సిరాజ్ తలా వికెట్ సాధించారు. గుజరాత్‌కు ఇది నాలుగో విజయం. ఈ విజయంతో గుజరాత్ పాయింట్ల పట్టికలో ఐదో స్ధానానికి చేరుకుంది.
చదవండి: IPL 2026: 'నీ సీక్రెట్స్ మొత్తం నాకు తెలుసు.. మా టీమ్‌పై నెమ్మదిగా ఆడు'


