సాయి సుదర్శన్‌ సరికొత్త చరిత్ర.. క్రిస్‌ గేల్‌ రికార్డు బద్దలు | Sai Sudharsan Scripts History, Shatters Chris Gayle's Long Standing IPL Record | Sakshi
Sakshi News home page

సాయి సుదర్శన్‌ సరికొత్త చరిత్ర.. క్రిస్‌ గేల్‌ రికార్డు బద్దలు

May 4 2026 5:43 PM | Updated on May 4 2026 5:53 PM

Sai Sudharsan Scripts History, Shatters Chris Gayle's Long Standing IPL Record

గుజరాత్‌ టైటాన్స్‌ ఓపెనర్‌ సాయి సుదర్శన్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో మొదటి 50 ఇన్నింగ్స్‌ల తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా క్రిస్‌ గేల్‌ పేరిట ఉండిన లాంగ్‌ స్టాండింగ్‌ రికార్డును బద్దలు కొట్టాడు. గేల్‌ తన తొలి 50 ఐపీఎల్‌ ఇన్నింగ్స్‌ల్లో 2061 పరుగులు చేయగా.. సాయి తన మొదటి 50 ఐపీఎల్‌ ఇన్నింగ్స్‌ల్లో 2178 పరుగులు చేశాడు.

ఐపీఎల్‌ 2026లో భాగంగా పంజాబ్‌ కింగ్స్‌పై నిన్న (మే 3) ఆడిన ఇన్నింగ్స్‌ సాయికి ఐపీఎల్‌లో 50వది. ఈ ఇన్నింగ్స్‌లో అతను 41 బంతుల్లో 57 పరుగులు చేసి తన జట్టు గెలుపుకు పటిష్ట పునాది వేశాడు. వాషింగ్టన్‌ సుందర్‌ (40 నాటౌట్‌) సిక్సర్‌తో ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చి గుజరాత్‌ను గెలిపించాడు.

పై రికార్డును సాధించే క్రమంలో సాయి మరో రికార్డు ఇదివరకే నెలకొల్పాడు. ఐపీఎల్‌లో 2000 పరుగుల మార్కును చేరడానికి అతి తక్కువ ఇన్నింగ్స్‌లు తీసుకున్న ఆటగాడిగా నిలిచాడు. ఈ రికార్డును చేరుకునే క్రమంలోనూ సాయి క్రిస్‌ గేల్‌ పేరిట ఉండిన రికార్డునే అధిగమించాడు. గేల్‌ ఈ మైలురాయిని 48 ఇన్నింగ్స్‌ల్లో చేరుకోగా.. సాయి 47వ ఇన్నింగ్స్‌లోనే ఈ ఘనత సాధించాడు.

ఈ సీజన్‌లో ఓ మోస్తరు ఫామ్‌లో ఉన్న సాయి.. ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో 3 అర్ద సెంచరీల సాయంతో 385 పరుగులు చేసి లీడింగ్‌ రన్‌ స్కోరర్ల జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు. తాజాగా పంజాబ్‌పై గెలుపుతో గుజరాత్‌ పాయింట్ల పట్టికలో ఐదో స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో ఆరేసి విజయాలతో 12 పాయింట్లు కలిగి ఉంది.

ప్రస్తుతం సన్‌రైజర్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌, ఆర్సీబీ కూడా 12 పాయింట్లు కలిగి ఉన్నప్పటికీ.. గుజరాత్‌ ఈ జట్ల కంటే తక్కువ రన్‌రేట్‌ కలిగి ఉండటంతో ఐదో స్థానంలో ఉంది. 13 పాయింట్లు కలిగి ఉన్న పంజాబ్‌ టేబుల్‌ టాపర్‌గా కొనసాగుతుంది. 

Advertisement
 
Advertisement
Advertisement