ఓపెనర్‌గా అతడే సరైన ఆప్షన్: సచిన్

ఆసీస్ బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉంది
కోహ్లి లేకపోతే కష్టమే..
న్యూఢిల్లీ: టీమిండియా క్రికెటర్ మయాంక్ అగర్వాల్‌పై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసలు కురిపించాడు. టీమిండియా ఆసీస్ టూర్ నేపథ్యంలో టెస్టుల్లో ఓపెనర్ స్థానానికి అతడే సరైన ఆప్షన్ అని పేర్కొన్నాడు. ఐపీఎల్-2020లో మెరుగైన ప్రదర్శన కనబరిచిన మయాంక్ అగర్వాల్ టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైన విషయం తెలిసిందే. తొలిసారిగా మూడు ఫార్మాట్లలోనూ(వన్డే, టీ20, టెస్టు) జట్టు సభ్యుడిగా చోటు సంపాదించుకున్న మయాంక్ తనను తాను నిరూపించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాడు. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఓపెనర్‌గా మైదానంలోకి అడుగుపెట్టాలంటే కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్‌ల రూపంలో అతడికి గట్టి పోటీ ఎదురుకానుంది.
కానీ టెస్టుల్లో మాత్రం ఈ పరిస్థితి ఉండదని సచిన్ అభిప్రాయపడ్డాడు. టీమిండియా ఆసీస్ టూర్, మయాంక్ ఆటతీరు గురించి సచిన్ మాట్లాడుతూ.. ‘‘ మయాంక్ స్కోరు(రన్స్) ఎంతో మెరుగ్గా ఉంది. కాబట్టి కచ్చితంగా ఒక మంచి ఓపెనర్ అవుతాడు. ఒకవేళ రోహిత్ ఫిట్‌నెస్ సాధించి, జట్టుతో చేరితే మయాంక్ తనకు మంచి జోడీ అవుతాడు. పృథ్వీ షా, కేఎల్ రాహుల్‌ల విషయంలో మేనేజ్‌మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చెప్పలేం. నాకు తెలిసి ఫాంలో ఉన్నవాళ్లను పక్కనపెట్టే అవకాశం ఉండదు’’ అని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున 11 మ్యాచ్‌లు ఆడిన మయాంక్ అగర్వాల్ 424(స్ట్రైక్ రేటు 156.45) పరుగులు చేశాడు. (చదవండి: రోహిత్ స్థానంలో అయ్యర్!)
ఆసీస్ బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉంది
ఇక ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉందన్న లిటిల్ మాస్టర్.. కంగారూ బ్యాట్స్‌మెన్‌ను సమర్థవంతంగా కట్టడి చేసేందుకు టీమిండియా ఇప్పటికే పూర్తిస్థాయిలో సన్నద్ధమై ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపాడు. ‘‘స్మిత్, వార్నర్ వంటి సీనియర్లకు లబుషేన్ తోడైతే ఆసీస్ బ్యాటింగ్ యూనిట్ మరింత మెరుగవుతుంది. ఈసారి ఇరు జట్ల మధ్య పోరు మరింత రసవత్తరంగా మారనుంది. ఇందుకు భారత జట్టు సిద్ధంగా ఉంది. నిజానికి కెప్టెన్ కోహ్లి జట్టుతో లేకపోవడం తీర్చలేని లోటే.
అయితే ఆ అవకాశాన్ని యువ ఆటగాళ్లు సద్వినియోగం చేసుకుంటే బాగుంటుంది’’ అని సచిన్ అభిప్రాయపడ్డాడు. కాగా గాయం కారణంగా రోహిత్ శర్మ ఆసీస్ టూర్‌కు దూరమైన సంగతి తెలిసిందే. అయితే చివరి రెండు టెస్టులకైనా అతడు అందుబాటులోకి వస్తే జట్టుకు ఉపయోగకరంగా ఉంటుందని బీసీసీఐ భావిస్తోంది. అలా జరగని పక్షంలో హిట్‌మాన్ స్థానంలో శ్రేయస్ అయ్యర్‌ను రిజర్వ్ ఆటగాడిగా తీసుకునే అవకాశాన్ని పరిశీలిస్తోంది.(చదవండి: ఐపీఎల్ 2020: బీసీసీఐ ఆదాయం ఎంతంటే!)
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి