సచిన్ 53వ పుట్టిన రోజు సంబరం
ముంబై: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ శుక్రవారం తన 53వ పుట్టిన రోజును ఘనంగా జరుపుకున్నాడు. సచిన్ ఇంటి వద్ద పెద్ద ఎత్తున అభిమానుల సందడి కనిపించింది. వారి మధ్య అతను బర్త్‌డే కేక్‌ను కట్ చేశాడు. అంతకుముందు ఈ రోజు గొప్పగా మొదలైందంటూ తన తల్లి రజని, భార్య అంజలి, పెంపుడు కుక్కతో కలిసి ఉన్న ఫోటోతో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ‘ఆయి (అమ్మ), అంజలి, నన్ను ఇబ్బంది పెట్టేవాడితో రోజు అద్భుతంగా మొదలైంది. ఇంతకంటే ఇంకేం కావాలి’ అని సచిన్ వ్యాఖ్యను జోడించాడు.

సచిన్‌కు అతని మాజీ సహచరులు హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్ తదితరులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో సచిన్ 200 టెస్టుల్లో 15,921 పరుగులు...463 వన్డేల్లో 18,426 పరుగులు సాధించాడు. రెండు ఫార్మాట్‌లలో అత్యధిక పరుగుల రికార్డు అతని పేరిటే ఉంది. టెస్టుల్లో అత్యధిక సెంచరీలు (51) చేసిన ఆటగాడైన సచిన్ ఖాతాలో 49 వన్డే శతకాలు ఉన్నాయి.


