రాజ్‌కోట్ వేదికగా సౌతాఫ్రికా-ఎతో జరిగిన తొలి అనధికారిక వన్డేలో రుతురాజ్ గైక్వాడ్ సూపర్ సెంచరీతో చెలరేగాడు. 286 పరుగుల లక్ష్య చేధనలో రుతురాజ్ అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. అభిషేక్ శర్మతో కలిసి భారత ఇన్నింగ్స్‌ను ఆరంభించిన గైక్వాడ్ వికెట్‌కు 64 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
వరుస క్రమంలో అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్ పెవిలియన్‌కు చేరినప్పటికి.. రుతురాజ్ మాత్రం తన ఏకాగ్రతను కోల్పోలేదు. ఈ మహారాష్ట్ర బ్యాటర్ ఆచితూచి ఆడుతూ 110 బంతుల్లో తన 16వ లిస్ట్-ఎ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 129 బంతులు ఎదుర్కొన్న గైక్వాడ్ 12 ఫోర్ల సాయంతో 117 పరుగులు చేసి ఔటయ్యాడు.
సౌతాఫ్రికా చిత్తు..
రుతురాజ్‌తో పాటు కెప్టెన్ తిలక్ వర్మ(39), నితీశ్ కుమార్ రెడ్డి(37), నిషాంత్ సింధు(29) రాణించారు. ఫలితంగా భారత-ఎ జట్టు ప్రోటీస్‌పై 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 286 పరుగుల లక్ష్యాన్ని ఇండియా-ఎ జట్టు 6 వికెట్లు కోల్పోయి 49.3 ఓవర్లలో చేధించింది.
అంతకముందు బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా-ఎ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 285 పరుగుల భారీ స్కోర్ చేసింది. ప్రోటిస్ పోట్‌గీటర్(88 పరుగులు; 103 బంతుల్లో), డెలనో పోట్‌గీటర్ (77 పరుగులు; 83 బంతుల్లో), బ్యోర్న్ ఫార్టూన్ (59 పరుగులు; 56 బంతుల్లో) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు.
అభిషేక్ ఫెయిల్..
కాగా 50 ఓవర్ల ఫార్మాట్‌లో స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి విఫలమయ్యాడు. అభిషేక్ దూకుడుగా ఆడి కేవలం 25 బంతుల్లోనే 31 పరుగులు చేసి ఔటయ్యాడు. తనకు లభించిన ఆరంభాన్ని భారీ స్కోర్‌గా మలచడంలో అతడు విఫలమయ్యాడు. ఈ పంజాబ్ క్రికెటర్ వరల్డ్ నంబర్ వన్ టీ20 బ్యాటర్‌గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.


