
పాక్-భారత్ జట్లు(ఫైల్ ఫోటో)
ఇంగ్లండ్ పర్యటనను విజయవంతంగా ముగించిన టీమిండియా.. ఇక ఆసియాకప్-2025కు సిద్దం కానుంది. ఈ ఖండాంతర మెగా టోర్నీ సెప్టెంబర్ 9 నుంచి యూఏఈ వేదికగా ప్రారంభం కానుంది. ఈ ఆసియా సింహాల పోరు కోసం భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ త్వరలోనే ప్రకటించనుంది. భారత్ తమ తొలి మ్యాచ్‌లో సెప్టెంబర్ 10న దుబాయ్ వేదికగా తలపడనుంది.
ఆ తర్వాత సెప్టెంబర్ 14న అదే దుబాయ్ అంతర్జాతీయ మైదానంలో చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో తాడోపేడో తెల్చుకోనుంది. పెహాల్గమ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌తో మ్యాచ్‌ను బహిష్కరించాలని కొంతమంది అంటుంటే.. మరి కొంతమంది దాయాదిని చిత్తు ప్రతీకారం తీర్చుకోవాలని అభిప్రాయపడుతున్నారు.
ఏదేమైనప్పటికి క్రికెట్ ప్రపంచంలో పాకిస్తాన్-భారత్ మ్యాచ్ ఉన్న క్రేజే వేరు. దాయాదుల పోరు రోజును అభిమానులు టీవీలకు అతుక్కుపోవాల్సిందే. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ జట్టుపై మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాతో పోలిస్తే తమ జట్టు చాలా బలహీనంగా ఉందని, ఇటీవలే పాక్ ప్రదర్శనలపై అతడు ఆందోళన వ్యక్తం చేశాడు. పాకిస్తాన్ ప్రస్తుతం విండీస్ పర్యటనలో ఉంది. ఆతిథ్య జట్టుతో టీ20 సిరీస్‌ను పాక్ 2-1 తేడాతో సొంతం చేసుకుంది. కానీ అంతకుముందు బంగ్లాదేశ్‌తో సిరీస్‌ను మాత్రం 1-2 తేడాతో మెన్ ఇన్ గ్రీన్ కోల్పోయింది.
"ఆసియాకప్‌లో బలమైన భారత జట్టుతో తలపడడం పాకిస్తాన్‌కు అంత సులువు కాదు. మా జట్టు ప్రస్తుతం నిలకడగా రాణించలేకపోతుంది. ఎప్పుడు లేని విధంగా బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌ను కోల్పోయింది. పాక్ జట్టు ప్రదర్శన ఎలా ఉందో ఈ సిరీస్ ఫలితం బట్టి ఆర్ధం చేసుకోవచ్చు.
ఆ తర్వాత వెస్టిండీస్‌లో కూడా ఓ మ్యాచ్ ఓడిపోయారు. సల్మాన్ అలీ అఘా కెప్టెన్‌గా సరైనోడే. కానీ మూడు ఫార్మాట్లలో జట్టును నడిపించడం అంత ఈజీ కాదు. మా దగ్గర అద్బుతమైన ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారు. కానీ వారిని సరిగ్గా ఉపయోగించుకోవడంలో పాక్ క్రికెట్ బోర్డు విఫలమవుతోంది" అని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లతీఫ్ పేర్కొన్నాడు.
చదవండి: ఇక్కడున్నా బిర్యానీ తక్కువే.. ఆ ఫుడ్ అసలే తినడు: సిరాజ్ సోదరుడు