‘దశ ధీర’ నాదల్‌

Rafael Nadal wins 10th title in Italian capital with victory over Novak Djokovic - Sakshi

పదోసారి రోమ్‌ ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌ టోర్నీ టైటిల్‌ హస్తగతం

ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్‌ జొకోవిచ్‌పై విజయం

రూ. 2 కోట్ల 18 లక్షల ప్రైజ్‌మనీ సొంతం

అత్యధిక ‘మాస్టర్స్‌’ టైటిల్స్‌ నెగ్గిన ప్లేయర్‌గా జొకోవిచ్‌ సరసన స్పెయిన్‌ స్టార్‌

రోమ్‌: మట్టికోర్టులపై తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకుంటూ స్పెయిన్‌ టెన్నిస్‌ స్టార్‌ రాఫెల్‌ నాదల్‌ తన కెరీర్‌లో 88వ సింగిల్స్‌ టైటిల్‌ను సాధించాడు. ఆదివారం ముగిసిన రోమ్‌ ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌–1000 టోర్నీలో నాదల్‌ చాంపియన్‌గా నిలిచాడు. 2 గంటల 49 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్‌ నాదల్‌ 7–5, 1–6, 6–3తో ప్రపంచ నంబర్‌వన్, టాప్‌ సీడ్, డిఫెండింగ్‌ చాంపియన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ (సెర్బియా)పై గెలుపొందాడు.

34 ఏళ్ల నాదల్‌ రోమ్‌ ఓపెన్‌ టైటిల్‌ను నెగ్గడం ఇది పదోసారి కావడం విశేషం. ఈ స్పెయిన్‌ స్టార్‌ 2005, 2006, 2007, 2009, 2010, 2012, 2013, 2018, 2019లలో కూడా ఇక్కడ టైటిల్‌ సాధించాడు. తద్వారా ఒకే టోర్నమెంట్‌ను నాలుగుసార్లు కనీసం 10 లేదా అంతకంటే ఎక్కువసార్లు గెలిచిన ప్లేయర్‌గా తన రికార్డును మెరుగుపర్చుకున్నాడు. నాదల్‌ 13 సార్లు ఫ్రెంచ్‌ ఓపెన్‌ను... బార్సిలోనా ఓపెన్‌ను 12 సార్లు... మోంటెకార్లో మాస్టర్స్‌ సిరీస్‌ టోర్నీని 11 సార్లు గెలిచాడు.

ఈ విజయంతో అత్యధిక మాస్టర్స్‌ సిరీస్‌ టైటిల్స్‌ నెగ్గిన ప్లేయర్‌గా జొకోవిచ్‌ (36 టైటిల్స్‌) పేరిట ఉన్న రికార్డును నాదల్‌ (36 టైటిల్స్‌) సమం చేశాడు. అంతేకాకుండా జొకోవిచ్‌తో ముఖాముఖి రికార్డులో ఆధిక్యాన్ని 28–29కి తగ్గించాడు. రోమ్‌ ఓపెన్‌ విజేత హోదాలో నాదల్‌కు 2,45,085 యూరోల (రూ. 2 కోట్ల 18 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. రన్నరప్‌ జొకోవిచ్‌ ఖాతాలో 1,45,000 యూరోల ప్రైజ్‌మనీ (రూ. కోటీ 29 లక్షలు)తోపాటు 600 ర్యాంకింగ్‌ పాయింట్లు దక్కాయి. రోమ్‌ ఓపెన్‌లో జొకోవిచ్‌ ఐదుసార్లు విజేతగా నిలిచి, ఆరుసార్లు రన్నరప్‌తో సంతృప్తి పడ్డాడు.  

జొకోవిచ్‌తో జరిగిన ఫైనల్లో తొలి సెట్‌ హోరాహోరీగా జరిగింది. 75 నిమిషాలపాటు జరిగిన తొలి సెట్‌లోని 12వ గేమ్‌లో జొకోవిచ్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసి నాదల్‌ సెట్‌ సొంతం చేసుకున్నాడు. అయితే రెండో సెట్‌లో జొకోవిచ్‌ దూకుడుకు నాదల్‌ తడబడ్డాడు. అనవసర తప్పిదాలు చేసి కేవలం ఒక గేమ్‌ మాత్రమే గెలిచి సెట్‌ను కోల్పోయాడు. అయితే నిర్ణాయక మూడో సెట్‌లో నాదల్‌ మళ్లీ లయలోకి వచ్చాడు. ఆరో గేమ్‌లో జొకోవిచ్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన నాదల్‌ ఏడో గేమ్‌లో తన సర్వీస్‌ను నిలబెట్టుకొని 5–2తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత జొకోవిచ్‌ ఎనిమిదో గేమ్‌లో తన సర్వీస్‌ను కాపాడుకున్నాడు. తొమ్మిదో గేమ్‌లో నాదల్‌ తన సర్వీస్‌ను నిలబెట్టుకొని సెట్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు.

‘ఈ టోర్నీలో నాకు అదృష్టం కూడా కలిసొచ్చింది. ముఖ్యంగా షపవలోవ్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండుసార్లు మ్యాచ్‌ పాయింట్లను కాచుకొని గట్టెక్కాను. ఓవరాల్‌గా ఈ టోర్నీలో బాగా ఆడాను.’ 
–రాఫెల్‌ నాదల్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top