ప్రేక్షకులు లేకపోవడం లోటే: సింధు

PV Sindhu learns new skills ahead of Olympics - Sakshi

హైదరాబాద్‌: కోవిడ్‌ ప్రపంచాన్ని పట్టి పీడిస్తుంటే... బ్యాడ్మింటన్‌ ప్రపంచ చాంపియన్‌ పూసర్ల వెంకట సింధు మాత్రం తనకు మహమ్మారితో కీడు కంటే మేలే జరిగిందని చెప్పుకొచ్చింది. గురువారం ఇక్కడ వర్చువల్‌ మీడియా కార్యక్రమంలో పా ల్గొన్న ఆమె మాట్లాడుతూ ‘కరోనా వల్ల వచ్చిన విరామం నాకైతే బాగా దోహద పడింది. ఆటతీరు మెరుగుపర్చుకునేందుకు సాంకేతిక నైపుణ్యం సాధించేందుకు విరామం అక్కరకొచ్చింది.

దీని వల్ల ఎక్కువ సమ యం ఆటపైనే దృష్టి పెట్టేలా చేసింది. ఇవన్నీ నా ఆటకు, టోక్యోలో ముం దంజ వేసేందుకు తప్పకుండా ఉపయోగపడతాయనే గట్టి నమ్మకంతో ఉన్నాను. సాధారణంగా అయి తే విదేశాల్లో జరిగే టోర్నీలు ఆడేందుకు వెళ్లడం, తిరిగొచ్చి శిక్షణలో గడపటం పరిపాటి అయ్యేది. ప్రయాణ బడలిక, బిజీ షెడ్యూల్‌ వల్ల సమయం పూర్తి స్థాయి శిక్షణకు అంతగా సహకరించేది కాదు. ఇప్పుడైతే విరామంతో వీలైనంత ప్రాక్టీస్‌ చేసేందుకు మరెంతో సమయం లభిం చింది’ అ ని వివరించింది. ప్రేక్షకుల్లేకపోవడాన్ని మాత్రం లోటుగా భావిస్తున్నట్లు సింధు చెప్పింది.

1000 మంది వీఐపీలతోనే...
టోక్యో: విశ్వక్రీడలు ఎక్కడ జరిగినా... ఏ దేశం ఆతిథ్యమిచ్చినా... ప్రారంభోత్సవ వేడుకలైతే అంబరాన్ని అంటుతాయి. అయితే కరోనా కార ణంగా ఈ నెల 23న నేషనల్‌ స్టేడియంలో జరిగే ప్రతిష్టాత్మక వేడుకకు కేవలం వందల సంఖ్యలోనే అది కూడా వీఐపీ ప్రేక్షకులను మాత్రమే అనుమతించనున్నారు. 68 వేల సామర్థ్యమున్న స్టేడియంలో కేవలం 1000 లోపు  ప్రముఖులే ఈ వేడుకల్ని ప్రత్యక్షంగా తిలకిస్తారు.  

టోక్యో గవర్నర్‌తో ఐఓసీ చీఫ్‌ భేటీ
ఇంకో వారంలో ఒలింపిక్స్‌  ప్రారంభం కానున్న నేపథ్యంలో గత మూడు రోజులుగా జపాన్‌ అధ్యక్షుడు సీకో హషిమొటో, ప్రధాని యోషిహిదే సుగాలతో సమావేశమైన ఐఓసీ అధ్యక్షుడు థామస్‌ బాచ్‌ గురువారం కూడా టోక్యో గవర్నర్‌ యూయికొ కొయికేతో మీటింగ్‌లో పాల్గొన్నారు. తుది ఏర్పాట్లు, అత్యవసర పరిస్థితి (టోక్యోలో ఎమర్జెన్సీ)లో అ నుసరిస్తున్న వ్యూహాలపై చర్చించారు.

కేసుల హైరానా
కోవిడ్‌ కేసులు జపాన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా టోక్యోలో అత్యవసర పరిస్థి తి విధించారు. అయినా సరే టోక్యో నగరంలో కరోనా బాధితులు పెరిగిపోతున్నా రు. బుధవారం 1485 మంది, గురువారం మరో 1308 మందికి వైరస్‌ సోకింది. ఈ రెండు రోజులు కూడా గడిచిన ఆరు నెలల్లో ఒక రోజు నమోదైన కేసుల సంఖ్యను (జనవరి 21న 1149 కేసులు) అధిగమించాయి.

ఏర్పాట్లన్నీ బాగున్నాయి: ఐఓఏ
న్యూఢిల్లీ: టోక్యోలో ఆటగాళ్లకు, సిబ్బందికి ఏర్పాటు చేసిన వసతులు, ఇతరత్రా సదుపాయాలన్నీ బాగున్నాయని భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) అధ్యక్షుడు నరీందర్‌ బాత్రా చెప్పారు. భారత చెఫ్‌ డి మిషన్‌ బి.పి.బైశ్యా నేతృత్వంలోని బృందం ఈ నెల 14నే టోక్యో చేరుకొని ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసిందని బాత్రా తెలిపారు. కొన్ని చిన్న చిన్న సమస్యలున్నా పరిష్కరిస్తామని నిర్వాహకులు చెప్పినట్లు ఆయన వివరించారు. విదేశాల్లో శిక్షణ తీసుకుంటున్న పలువురు భారత అథ్లెట్లు నేరుగా జపాన్‌ వెళ్లనుండగా... భారత్‌ నుంచి మాత్రం 90 మందితో కూడిన తొలి బృందం రేపు అక్కడికి పయనమవుతుంది.

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top