నాన్నంటే వాడికి ప్రాణం.. ఇంగ్లండ్‌కు వెళ్లే ముందు నాతో ఏమన్నాడంటే.. | Pray For Me: Siraj Mother Recalls Tearful Moments Before England Tour | Sakshi
Sakshi News home page

నాన్న సమాధి దర్శించుకున్నాకే ఎక్కడికైనా!.. ఇంగ్లండ్‌కు వెళ్లే ముందు నాతో ఏమన్నాడంటే..

Aug 5 2025 4:41 PM | Updated on Aug 5 2025 5:39 PM

Pray For Me: Siraj Mother Recalls Tearful Moments Before England Tour

కుటుంబంతో సిరాజ్‌ (పాత ఫొటో PC: Siraj Instagram)

క్రికెట్‌ వర్గాల్లో ప్రస్తుతం మార్మోగిపోతున్న పేరు మహ్మద్‌ సిరాజ్‌ (Mohammed Siraj). ఇంగ్లండ్‌తో ఓవల్‌ టెస్టులో ఈ హైదరాబాదీ అద్బుతమే చేశాడు. ఓటమి కోరల్లో చిక్కుకున్న టీమిండియాను తన అద్భుతమైన డెలివరీతో విజయతీరాలకు చేర్చాడు.

బాగా ఆడి ఇండియాను గెలిపించాలి
ఇంగ్లండ్‌తో ఓవరాల్‌గా ఐదు టెస్టుల్లో 185 ఓవర్లు బౌల్‌ చేసి.. ఏకంగా 23 వికెట్లు కూల్చాడు. ఆండర్సన్‌- టెండుల్కర్‌ ట్రోఫీ (Anderson- Tendulkar Trophy)ని భారత్‌ 2-2తో సమం చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, ఈ సిరీస్‌ కోసం ఇంగ్లండ్‌కు బయల్దేరే ముందు సిరాజ్‌ తన తల్లితో అన్న మాటలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

ఈ విషయం గురించి సిరాజ్‌ తల్లి షబానా బేగం టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘అమ్మా.. నాకోసం ప్రార్థన చేస్తూ ఉండు. నేను బాగా ఆడి ఇండియాను గెలిపించాలని ప్రార్థించు’’ అని కుమారుడు తనతో చెప్పాడన్నారు.

నాన్నంటే వాడికి ప్రాణం
అదే విధంగా.. తండ్రి అంటే సిరాజ్‌కు ప్రాణమని.. ‘‘సిరాజ్‌కు వాళ్ల నాన్న అంటే చాలా ఇష్టం. ఆయనను ఎంతగానో ప్రేమిస్తాడు. తండ్రి కోసం ఏం చేసేందుకైనా సిరాజ్‌ వెనకాడేవాడు కాదు. సిరాజ్‌ కోసం నేను ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉంటాను. నా కుమారుడు చేసే ప్రతి పనిలో విజయవంతం అయ్యేలా ఆ అల్లా దీవించాలి’’ అని షబానా మాతృప్రేమను చాటుకున్నారు.

కాగా సిరాజ్‌ క్రికెటర్‌గా ఎదగడంలో అతడి కుటుంబం పాత్ర కీలకం. తండ్రి మహ్మద్‌ గౌస్‌ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తూనే.. కుమారుడి కల నెరవేరేలా ప్రోత్సహించారు. సిరాజ్‌ అంటే ఆయనకూ ప్రాణమే. ఆయన కోరుకున్నట్లే కొడుకు టీమిండియాకు ఆడే స్థాయికి చేరుకున్నాడు.

కుమారుడి ఎదుగుదల చూడకుండానే
ముఖ్యంగా తనకు ఇష్టమైన టెస్టు ఫార్మాట్లో ఆడేందుకు సిద్ధమైన తరుణంలోనే.. దురదృష్టవశాత్తూ గౌస్‌ కన్నుమూశారు. 2021లో సిరాజ్‌ ఆస్ట్రేలియా పర్యటనలో ఉండగా గౌస్‌ మరణించారు. అయితే, దేశం కోసం ఆడటమే ముఖ్యమని ఆయన నేర్పిన విలువలకు తగ్గట్లుగా అక్కడే ఉండిపోయిన సిరాజ్‌ తండ్రిని కడసారి చూసుకోలేకపోయాడు.

తండ్రి సమాధి దర్శించుకున్న తర్వాతే
అయితే, ఆయన కోరుకున్నట్లుగానే టీమిండియా టాప్‌ పేసర్‌గా ఎదిగి ఇలా ప్రశంసలు అందుకుంటున్నాడు. కాగా తాను సిరీస్‌ ఆడేందుకు సన్నద్ధమయ్యే ముందు ముందుగా సిరాజ్‌ తన తండ్రి సమాధిని దర్శించుకుని అక్కడ ప్రార్థన చేస్తాడు. తాజాగా ఇంగ్లండ్‌కు వెళ్లే ముందు కూడా సిరాజ్‌ ఈ ఆనవాయితీని పాటించాడు. అత్యుత్తమ ప్రదర్శనతో భారత్‌కు చిరస్మరణీయ విజయం అందించాడు.

చదవండి: ‘డ్రా’ అయినందుకే ఇంత సంబరమా?.. అవును.. కొన్ని పొరపాట్లున్నా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement