
బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీలో పలు మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఛీప్ సెలక్టర్ అజిత్ అగార్కకర్ పదవీ కాలాన్ని పొడిగించిన బీసీసీఐ.. సౌత్‌జోన్ సెలక్టర్ శ్రీధరన్ శరత్‌తో పాటు మరొకరిపై వేటు వేసేందుకు సిద్దమైంది. ఈ క్రమంలోనే జాతీయ సెలెక్టర్ పదవులకు భారత క్రికెట్ బోర్డు దరఖాస్తులను ఆహ్వానించింది. కాగా ప్రస్తుత సెలక్షన్ కమిటీలో అగార్కర్‌తో పాటు ఎస్ఎస్ దాస్, సుబ్రతో బెనర్జీ, అజయ్ రాత్రా, ఎస్ శరత్ ఉన్నారు.
సెలక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా..
టీమిండియా మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా సౌత్ జోన్ నుంచి జాతీయ సెలెక్టర్ అయ్యే అవకాశముందని టైమ్స్ ఆఫ్ ఇండియా తమ రిపోర్ట్‌లో పేర్కొంది. సెలెక్టర్‌గా దాదాపు నాలుగేళ్లు పూర్తి చేసుకున్న ఎస్. శరత్ స్థానంలో ఓజా ఎంపిక కానున్నట్లు తెలుస్తోంది.
అయితే శరత్ మరోసారి జూనియర్ సెలక్షన్ కమిటీ చీఫ్ సెలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టే ఛాన్స్ ఉందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ప్రజ్ఞాన్ ఓజా 24 టెస్టులు, 18 వన్డేలు, 6 టీ20ల్లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్‌లో ప్రజ్ఞాన్ ఐపీఎల్‌లో కూడా ముంబై ఇండియన్స్, డక్కన్ ఛార్జర్స్ తరపున ఆడాడు
నేషనల్ సెలెక్టర్ ధరఖాస్తుకు ఆర్హతలు ఇవే..
టీమిండియా సెలక్టర్ పదవికి దరఖాస్తు చేసుకోవాలంటే కనీసం 7 టెస్టులు లేదా 10 వన్డేలు లేదా కనీసం 30 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాలి. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి కనీసం ఐదేళ్లు దాటి ఉండాలి. బీసీసీఐ ఏ క్రికెట్ కమిటీలోనూ 5 సంవత్సరాల పాటు సభ్యుడిగా పనిచేసి ఉండకూడదు.
కాగా అజిత్ అగార్కర్ కాంట్రాక్ట్‌ను వచ్చే ఏడాది జూన్ వరకు బీసీసీఐ పొడిగించింది. అతడి పదవీకాలంలో టీమిండియా టీ20 ప్రపంచకప్-2024, ఛాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిల్స్‌ను సొంతం చేసుకుంది. అదేవిధంగా వన్డే ప్రపంచకప్-2023 రన్నరప్‌గా కూడా మెన్ ఇన్ బ్లూ నిలిచింది. ఈ క్రమంలోనే అజిత్ కాంట్రాక్ట్‌ను పొడిగించేందుకు బీసీసీఐ మొగ్గు చూపింది.
చదవండి: నా బెస్ట్ కెప్టెన్ అతడే.. ధోనికి కూడా అంత సులువుగా ఏదీ రాలేదు: ద్రవిడ్