Prabath Jayasuriya: టెస్ట్‌ క్రికెట్‌లో నయా సెన్సేషన్‌.. తొలి మూడు టెస్ట్‌ల్లో ఏకంగా 29 వికెట్లు..! 

Prabath Jayasuriya Takes 29 Wickets In First 3 Tests - Sakshi

శ్రీలంక స్పిన్నర్‌ ప్రభాత్‌ జయసూర్య టెస్ట్‌ క్రికెట్‌లో నయా సెన్సేషన్‌గా మారాడు. 30 ఏళ్ల లేటు వయసులో సుదీర్ఘ ఫార్మాట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ లెఫ్ట్‌ ఆర్మ్‌ ఆర్థోడాక్స్‌ బౌలర్‌.. తన వైవిధ్యమైన స్పిన్‌ మాయాజాలంతో సరికొత్త రికార్డులు నెలకొల్పుతూ ప్రత్యర్ధుల పాలిట సింహస్వప్నంలా మారాడు. ఇప్పటివరకు ఆడిన 3 టెస్ట్‌ల్లో ఏకంగా 29 వికెట్లు నేలకూల్చిన ప్రభాత్‌.. తన జట్టును రెండు పర్యాయాలు ఒంటిచేత్తో గెలిపించాడు. 

తాజాగా పాక్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో 8 వికెట్లు (3/80, 5/117) పడగొట్టి.. తన జట్టుకు అపురూప విజయాన్నందించిన (246 పరుగుల భారీ తేడాతో ఘన విజయం)  ప్రభాత్‌.. అంతకుముందు ఆసీస్‌ సిరీస్‌లో రెండో టెస్ట్‌నూ రెచ్చిపోయి (6/118, 6/59) ఆర్ధిక సంక్షోభంలో కొట్టిమిట్టాడుతున్న తన దేశానికి ఊరట కలిగించే విజయాన్నందించాడు. ఈ ప్రదర్శనతో రాత్రికిరాత్రి హీరో అయిపోయిన ప్రభాత్‌.. ఆతర్వాత పాక్‌పై తొలి టెస్ట్‌లోనూ చెలరేగి 9 వికెట్లు (5/82, 4/135) సాధించాడు. 

అయితే ఈ మ్యాచ్‌లో పాక్‌ ఓపెనర్‌ అబ్దుల్లా షఫీక్‌ (160 నాటౌట్‌) సూపర్‌ సెంచరీతో రెచ్చిపోవడంతో పాక్‌ 342 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి రికార్డు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లోనూ శక్తి వంచన లేకుండా బౌలింగ్‌ చేసిన ప్రభాత్‌కు మరో ఎండ్‌ నుంచి సరైన సహకారం లభించకపోవడంతో లంక భారీ టార్గెట్‌ను డిఫెండ్‌ చేసుకోలేకపోయింది.  ప్రస్తుతం  ప్రపంచం‍లో అత్యంత పటిష్టమైన బ్యాటింగ్‌ లైనప్‌ కలిగిన ఆసీస్‌, పాక్‌ లాంటి జట్లనే వణికించిన ఈ నయా స్పిన్‌ సెన్సేషన్‌.. మున్ముందు మరిన్ని రికార్డులను బద్దలుకొడతాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 
చదవండి: రెచ్చిపోయిన స్పిన్నర్లు.. పాక్‌ను మట్టికరిపించిన లంకేయులు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top