
ఇంగ్లండ్ విధ్వంసకర ఓపెనర్ ఫిల్ సాల్ట్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. హండ్రెడ్ లీగ్ 1000 పరుగులు సాధించిన తొలి పురుష బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. హండ్రెడ్ లీగ్ 2025 ఎడిషన్‌లో భాగంగా డిఫెండింగ్ ఛాంపియన్స్ ఓవల్ ఇన్విన్సిబుల్స్‌తో నిన్న (ఆగస్ట్ 9) జరిగిన మ్యాచ్‌లో సాల్ట్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో సాల్ట్ (మాంచెస్టర్ ఒరిజినల్స్).. 32 బంతుల్లో బౌండరీ, 3 సిక్సర్ల సాయంతో 41 పరుగులు చేశాడు.
సాల్ట్ ఓ మోస్తరు స్కోర్‌తో రాణించినా ఈ మ్యాచ్‌లో అతని జట్టు ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేస్తూ నిర్ణీత 100 బంతుల్లో 128కి ఆలౌటైన ఒరిజినల్స్.. ఆతర్వాత లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. ఇన్విన్సిబుల్స్ కేవలం 57 బంతుల్లోనే లక్ష్యాన్ని ఛేదించింది. విల్ జాక్స్ (26 బంతుల్లో 61; 10 ఫోర్లు, 2 సిక్సర్లు), తవండ ముయేయే (28 బంతుల్లో 59; 10 ఫోర్లు, సిక్స్) విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడి ఇన్విన్సిబుల్స్‌ను గెలిపించారు.
చెలరేగిన రషీద్ ఖాన్
ఈ మ్యాచ్‌లో ఇన్విన్సిబుల్స్ బౌలర్ రషీద్ ఖాన్ చెలరేగిపోయాడు. తన కోటా 20 బంతుల్లో కేవలం 19 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు తీశాడు. రషీద్ ఖాన్‌తో పాటు ఇన్విన్సిబుల్స్ బౌలర్లు బెహ్రెన్‌డార్ఫ్, సాకిబ్ మహమూద్, సామ్ కర్రన్ కూడా రాణించారు. వీరంతా పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు తలో 2 వికెట్లు తీశారు.