రేపే కమిన్స్‌ రాక | Pat Cummins To Arrive In India On April 17 But Not To Play Straightaway | Sakshi
Sakshi News home page

రేపే కమిన్స్‌ రాక

Apr 16 2026 10:57 AM | Updated on Apr 16 2026 12:05 PM

Pat Cummins To Arrive In India On April 17 But Not To Play Straightaway

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అభిమానులకు శుభవార్త. ఆ జట్టు రెగ్యులర్‌ కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ రేపు (ఏప్రిల్‌ 17) భారత్‌కు వస్తున్నాడు. అయితే అతను వచ్చీ రాగానే ఏప్రిల్‌ 18న సీఎస్‌కేతో జరిగే మ్యాచ్‌కు అందుబాటులో ఉండడు. ఏప్రిల్‌ 21న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే మ్యాచ్‌కు కూడా అనుమానమే అని తెలుస్తుంది. అయితే, ఏప్రిల్‌ 25న రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌లో మాత్రం తప్పక ఆడే అవకాశం ఉంటుంది.  

కాగా, కమిన్స్‌ గాయం (recurring back injury) కారణంగా లీగ్‌ ప్రారంభానికి ముందే స్కాన్ల కోసం స్వదేశానికి వెళ్లాడు. బుధవారం చేసిన  స్కాన్‌లు అతని గాయం పూర్తిగా పరిష్కారమైందని నిర్ధారించాయి. దీంతో క్రికెట్‌ ఆస్ట్రేలియా అతనికి ఐపీఎల్‌ 2026లో ఆడేందుకు అనుమతినిచ్చింది.

గాయం కారణంగా కమిన్స్‌ గతేడాది యాషెస్‌ సిరీస్‌ తర్వాత ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. టీ20 ప్రపంచకప్‌ను కూడా మిస్‌ అయ్యాడు. ఇప్పుడు ఐపీఎల్‌ రెండో అర్ధభాగంలో ఆడేందుకు సిద్ధమయ్యాడు. కమిన్స్‌ గైర్హాజరీలో ఇషాన్‌ కిషన్‌ ఎస్‌ఆర్‌హెచ్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.

ఈ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో 2 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఎస్‌ఆర్‌హెచ్‌ తాజాగా ఓటమెరుగని రాజస్థాన్‌ రాయల్స్‌పై సంచలన విజయం సాధించి, ఈ సీజన్‌లో వారికి ఓటమి రుచి చూపించింది. 

ఆ మ్యాచ్‌లో ప్రఫుల్‌ హింగే, సాకిబ్‌ హుస్సేన్‌ అనే అరంగేట్రం పేసర్లు చెలరేగిపోయారు. తలో 4 వికెట్లు తీసి పటిష్టమైన రాయల్స్‌ బ్యాటింగ్‌ లైనప్‌ను కుప్పకూల్చారు.

ఈ మ్యాచ్‌కు ముందు వరకు ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలింగ్‌ చాలా బలహీనంగా ఉండింది. హింగే, సకీబ్‌ రాక.. త్వరలో కమిన్స్‌ చేరిక తదుపరి మ్యాచ్‌ల్లో ఎస్‌ఆర్‌హెచ్‌ ఫేట్‌ను మార్చే అవకాశం ఉంది. బ్యాటింగ్‌లో ఇషాన్‌, క్లాసెన్‌ ఫామ్‌ సంతృప్తినిస్తున్నా.. అభిషేక్‌, హెడ్‌ నిలకడలేమి కలవరపెడుతుంది. స్టాండ్‌ ఇన్‌ కెప్టెన్‌గా ఇషాన్‌ మంచి మార్కులు సాధించాడు. గత మ్యాచ్‌లో అతను హింగే, సకిబ్‌ లాంటి యువ టాలెంట్‌ను పరిచయ​ం చేసి మార్కులు కొట్టేశాడు.

 

Advertisement
 
Advertisement
Advertisement