టెస్టు క్రికెట్‌లో టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి (Virat Kohli) ఉన్నత శిఖరాలు అధిరోహించాడు. సంప్రదాయ ఫార్మాట్లో కెప్టెన్‌గా భారత్‌ను అగ్రస్థానంలో నిలిపిన కోహ్లి.. మొట్టమొదటి వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లో జట్టును ఫైనల్‌కు చేర్చాడు.
ఇక టీమిండియా తరఫున మొత్తంగా 123 టెస్టులు ఆడిన కోహ్లి.. 9230 పరుగులు సాధించాడు. ఇందులో 30 శతకాలు కూడా ఉన్నాయి. అయితే, అనూహ్య రీతిలో ఇటీవల ఇంగ్లండ్ పర్యటనకు ముందు తనకు ఇష్టమైన టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు కోహ్లి.
భారత్- ‘ఎ’ జట్టు కెప్టెన్‌గా
ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా గాయపడిన టీమిండియా స్టార్ రిషభ్ పంత్ (Rishabh Pant) రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. సౌతాఫ్రికా-‘ఎ’తో అనధికారిక టెస్టు సిరీస్ సందర్భంగా పంత్ భారత్- ‘ఎ’ జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య గురువారం బెంగళూరు వేదికగా తొలి టెస్టు మొదలైంది.
కోహ్లిని అవమానించిన పంత్?!.. ఫ్యాన్స్ ఫైర్
ఈ మ్యాచ్‌లో పంత్ ‘18’ నంబర్ ఉన్న జెర్సీ ధరించడం కోహ్లి అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. కాగా 18 నంబర్ విరాట్ కోహ్లిది అన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ‘‘రిషభ్ పంత్ కావాలనే 18వ నంబర్ జెర్సీ ధరించి కోహ్లిని అవహేళన చేయాలని చూస్తున్నాడా?.. కోహ్లి అంటే పడని.. హెడ్‌కోచ్ గౌతం గంభీర్ దృష్టిలో పడి.. అతడిని ఆకట్టుకోవాలనే ఇలా చేస్తున్నాడా?

అది కింగ్ కోహ్లి నంబర్. క్రీడా ప్రపంచంలో దిగ్గజ ఆటగాడు రిటైర్ అయిన తర్వాత అతడి గౌరవార్థం జెర్సీ నంబర్‌కు కూడా రిటైర్మెంట్ ఇవ్వాలి’’ అంటూ తీవ్ర స్థాయిలో కోహ్లి ఫ్యాన్స్ మండిపడుతున్నారు. కాగా ఇటీవల భారత్- ‘ఎ’ తరఫున ఇంగ్లండ్ లయన్స్‌తో మ్యాచ్‌లో పేసర్ ముకేశ్ కుమార్ కూడా 18 నంబర్ ఉన్న జెర్సీ ధరించగా ఇలాగే విమర్శలు వచ్చాయి.
అసలు విషయం ఇదీ!
ఈ నేపథ్యంలో బీసీసీఐ వర్గాలు PTIతో మాట్లాడుతూ.. ‘‘భారత్- ‘ఎ’ జట్టులో జెర్సీ నంబర్లు ప్రత్యేకంగా ఎవరికీ కేటాయించబడవు. వాటిపై పేర్లు కూడా ఉండవు. కాబట్టి మ్యాచ్‌కు ముందు తమకు వచ్చిన జెర్సీలను ఆటగాళ్లు ధరిస్తారు. అంతర్జాతీయ స్థాయిలో మాత్రమే పర్టికులర్‌గా జెర్సీ నంబర్లకు ప్రాధాన్యం ఉంటుంది’’ అని తెలిపాయి.
కాగా సౌతాఫ్రికా- ‘ఎ’తో తొలి అనధికారిక టెస్టులో టాస్ గెలిచిన భారత్-‘ఎ’ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో 79 ఓవర్లలో సౌతాఫ్రికా జట్టు ఏడు వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది. భారత బౌలర్లలో తనుశ్ కొటియాన్ నాలుగు వికెట్లు తీయగా.. అన్షుల్ కాంబోజ్, గుర్నూర్ బ్రార్, మానవ్ సుతార్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.


