
ఈ ఏడాది చివర్లో భారత్‌లో జరగాల్సిన ఆసియా కప్-2025 కోసం టోర్నీ అధికారిక ప్రసారదారు సోనీ స్పోర్ట్స్ ఓ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక టీ20 జట్లకు చెందిన కెప్టెన్లు సూర్యకుమార్ యాదవ్, నజ్ముల్ శాంటో, చరిత్ అసలంక మాత్రమే ఉన్నారు. ఈ పోస్టర్‌లో పాకిస్తాన్‌కు ప్రాతినిథ్యం లేకపోవడం సోషల్‌మీడియాలో చర్చలకు తావిచ్చింది. ఆసియా కప్ నుంచి పాక్ వైదొలిగిందని ప్రచారం మొదలైంది.
పహల్గాం ఉదంతం, తదనంతర పరిణామాల్లో (ఆపరేషన్ సిందూర్) భారత్, పాక్ మధ్య అప్పటివరకు ఉన్న తేలికపాటి సంబంధాలు కూడా తెగిపోయిన విషయం తెలిసిందే. క్రీడలు సహా అన్ని అంశాల్లో భారత్ పాక్‌తో సంబంధాలు తెంచుకుంది. క్రికెట్‌కు సంబంధించి ఆసియా కప్, ఐసీసీ టోర్నీల్లో, అదీ తటస్థ వేదికల్లో మాత్రమే భారత్ పాక్‌తో మ్యాచ్‌లు ఆడే విషయం పరిశీలనలో ఉంది. వాస్తవానికి క్రికెట్‌లో కూడా భారత్ పాక్‌తో పూర్తి స్థాయి సంబంధాలు తెంచుకోవాలని భారతీయుల నుంచి ఒత్తిడి ఉంది.
ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా పాకిస్తాన్‌కు చెందిన మంత్రి, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహిసిన్ నఖ్వీ ఉండటంతో భారత్ ఆసియా కప్ నుంచి కూడా వైదొలుగుతుందని పలు నివేదికలు తెలిపాయి.
మరికొన్ని నివేదికలేమో భారత్ తమ దేశ క్రికెట్ బోర్డు (బీసీసీఐ) పరపతిని ఉపయోగించి పాకిస్తాన్‌నే ఆసియా కప్ నుంచి వైదొలిగేలా చేస్తుందని చెప్పాయి. తాజాగా సోనీ స్పోర్ట్స్ పాక్ ప్రాతినిథ్యం లేని పోస్టర్‌ను విడుదల చేయడంతో ఇదే నిజమైదేంమోనని అనిపిస్తుంది. మొత్తానికి సోనీ స్పోర్ట్స్ విడుదల చేసిన ఆసియా కప్ పోస్టర్ భారత్, పాక్‌ల మధ్య మరోసారి అగ్గి రాజేసేలా ఉంది.
కాగా, ఆసియా కప్ 2025పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఈ టోర్నీ యొక్క ఖచ్చితమైన వివరాలు, వేదికలు, షెడ్యూల్ గురించి ఏసీసీ ఎలాంటి సమాచారం ఇవ్వ లేదు. ఏసీసీ అధ్యక్షుడిగా పాక్‌కు చెందిన వ్యక్తి ఉన్నా, తమ దేశ భాగస్వామ్యంపై ఇప్పటివరకు స్పందించలేదు. కొద్ది రోజుల కిందట టోర్నీని భారత్‌లో కాకుండా యూఏఈలో నిర్వహిస్తారని కూడా ప్రచారం జరిగింది.
2031 వరకు ఏసీసీ ఈవెంట్స్ హక్కులను దక్కించుకున్న సోనీ స్పోర్ట్స్
సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా (SPNI) 2024 నుండి 2031 వరకు అన్ని ఏసీసీ టోర్నమెంట్‌ల మీడియా హక్కులను $170 మిలియన్ల బేస్ ధరకు దక్కించుకుంది. ఇది మునుపటి సైకిల్ కంటే 70% ఎక్కువ. ఆశ్చర్యకరంగా మీడియా హక్కుల కోసం పోటీ బిడ్డింగ్ జరగలేదు. జియోస్టార్ మధ్యలో వైదొలిగింది.