జింబాబ్వే మహిళల జట్టు తొలిసారి పాకిస్తాన్‌లో పర్యటించనుంది. మే 4న మొదలయ్యే ఈ చారిత్రాత్మక సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన పాక్ వన్డే జట్టును అధికారికంగా ప్రకటించారు. ఈ జట్టుకు ఫాతిమా సనా సారథ్యం వహించనుంది. మే 4, 6, 9 తేదీల్లో నేషనల్ బ్యాంక్ స్టేడియం (కరాచీ) వేదికగా మూడు మ్యాచ్ వన్డే సిరీస్ జరుగనుంది. ఈ సిరీస్ ఐసీసీ వుమెన్స్ ఛాంపియన్షిప్ 2025–29లో భాగం కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ సిరీస్ కోసం ఎంపిక చేసిన పాక్ జట్టులో యువ స్పిన్నర్ మోమిరనా రియాసత్‌కు తొలిసారి చోటు దక్కింది. దేశీయ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేసిన ఆమె, ఇటీవల జరిగిన నేషనల్ టీ20 టోర్నీలో 16 వికెట్లు పడగొట్టి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించింది. వన్డే కప్‌లోనూ 19 వికెట్లు సాధించి తన ప్రతిభను నిరూపించుకుంది.
ఈ పర్యటన కోసం జింబాబ్వే జట్టు ఏప్రిల్ 29న కరాచీకి చేరుకోనుంది. ఏప్రిల్ 30 నుంచి మే 3 వరకు ఇరు జట్లు ప్రాక్టీస్ సెషన్లలో పాల్గొంటాయి. ప్రస్తుతం ఐసీసీ మహిళల ఛాంపియన్‌షిప్ పట్టికలో పాకిస్థాన్ ఐదో స్థానంలో ఉండగా, జింబాబ్వే ఎనిమిదో స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లకు ఈ సిరీస్ ఎంతో కీలకంగా మారింది.
జింబాబ్వేతో వన్డే సిరీస్ అనంతరం పాకిస్థాన్ మహిళల జట్టు ఐర్లాండ్ టీ20 ట్రై సిరీస్ 2026లో పాల్గొననుంది. ఇందులో ఐర్లాండ్, వెస్టిండీస్ జట్లు కూడా పోటీపడనున్నాయి. జూన్ 12 నుంచి జూలై 5 వరకు ఇంగ్లండ్‌లో జరిగే మహిళల టీ20 ప్రపంచకప్ 2026కు సన్నాహకంగా ఈ సిరీస్ ఉపయోగపడనుంది.
టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ గ్రూప్-1లో ఉంది. ఈ గ్రూప్‌లో భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ వంటి బలమైన జట్లు ఉన్నాయి. జింబాబ్వేతో వన్డే సిరీస్ అనంతరం పాక్ జట్టు ఆదే టీమ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కూడా ఆడనుంది. ఈ సిరీస్ మే 12, 14, 15 తేదీల్లో నేషనల్ బ్యాంక్ స్టేడియం వేదికగానే జరగనుంది.
జింబాబ్వే సిరీస్ కోసం పాక్ వన్డే జట్టు..
ఫాతిమా సనా (కెప్టెన్), అలియా రియాజ్, అయేషా జాఫర్, డయానా బేగ్, గుల్ ఫిరోజా, మోమినా రియాసత్, మునీబా అలీ (WK), నజిహా అల్వీ (WK), నష్రా సుంధు, నటాలియా పర్వైజ్, రమీన్ షమీమ్, సదాఫ్ షమాస్, సిద్రా అమీన్, సయ్యదా అరూబ్ షా, తస్మియా రుబాబ్
రిజర్వ్ ప్లేయర్లు: ఇరామ్ జావేద్, ఈమాన్ ఫాతిమా, సైరా జబీన్, తుబా హసన్, అంబర్ కైనాట్.


