PAK VS ENG 1st Test: టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో కనీవినీ ఎరుగని ఘట్టం

PAK VS ENG 1st Test: Openers Make Rare Record In Rawalpindi Test - Sakshi

పాకిస్తాన్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య రావల్పిండి వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌ మ్యాచ్‌ పలు ప్రపంచ రికార్డులకు వేదికైంది. టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో తొలి రోజు అత్యధిక స్కోర్‌ (506/4) రికార్డుతో పాటు తొలి రోజు 500 పరుగుల సాధించిన తొలి జట్టుగా, తొలి సెషన్‌లో అత్యధిక పరుగులు (27 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 174 పరుగులు) చేసిన జట్టుగా ఇం‍గ్లండ్‌ టీమ్‌ పలు ప్రపంచ రికార్డులను తమ ఖాతాలో వేసుకుంది.

వీటన్నిటికీ మిం‍చి తొలి రోజు ఏకంగా నలుగురు ఇంగ్లండ్‌ బ్యాటర్లు సెంచరీలు నమోదు చేశారు. ఇలా తొలి రోజు నలుగురు బ్యాటర్లు శతక్కొట్టడం టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో ఇదే ప్రధమం. ఓపెనర్లు బెన్‌ డకెట్‌ (106 బంతుల్లో 101 నాటౌట్‌; 14 ఫోర్లు), జాక్‌ క్రాలే (106 బంతుల్లో 120 నాటౌట్‌; 21 ఫోర్లు), ఓలీ పోప్‌ (104 బంతుల్లో 108; 14 ఫోర్లు), హ్యారీ బ్రూక్‌ (81 బంతుల్లో 101 నాటౌట్‌) సెంచరీలతో విరుచుకుపడ్డారు. 

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన  పాక్‌.. ఇంగ్లండ్‌ భారీ స్కోర్‌కు (657) ధీటుగా జవాబిస్తుంది. ఆ జట్టు ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్‌ (203 బంతుల్లో 114; 13 ఫోర్లు, 3 సిక్సర్లు), ఇమామ్‌ ఉల్‌ హాక్‌ (207 బంతుల్లో 121; 15 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ (168 బంతుల్లో 136; 19 ఫోర్లు, సిక్స్‌) శతకాలతో విరుచుకుపడ్డారు. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో తొలి ముగ్గురు బ్యాటర్లు సెంచరీలు సాధిస్తే.. పాక్‌ టాప్‌-4 బ్యాటర్లలో ముగ్గురు శతకొట్టారు. ఫలితంగా మూడో రోజు ఆట ముగిసే సమయానికి పాకిస్తాన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 499 పరుగులు చేసింది. 

కాగా, ఇదే టెస్ట్‌ మ్యాచ్‌లో పై పేర్కొన్న రికార్డులతో పాటు టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో కనీవినీ ఎరుగని ఓ అత్యంత అరుదైన రికార్డు నమోదైంది. ఓ టెస్ట్‌ మ్యాచ్‌లో ఇరు జట్లకు చెందిన ఓపెనర్లు (బెన్‌ డకెట్‌, జాక్‌ క్రాలే, అబ్దుల్లా షఫీక్‌, ఇమామ్‌ ఉల్‌ హాక్‌) తొలి ఇన్నింగ్స్‌లో శతకాలు బాదడం ఇదే తొలిసారి.

అలాగే ఓ టెస్ట్‌ మ్యాచ్‌లో తొలి వికెట్‌కు రెండు డబుల్‌ హండ్రెడ్‌ పార్ట్‌నర్‌షిప్‌లు నమోదు కావడం కూడా ఇదే తొలిసారి. 1948లో పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌ వేదికగా వెస్టిండీస్‌-ఇంగ్లండ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇరు జట్లకు చెందిన నలుగురు ఓపెనర్లు సెంచరీలు సాధించారు. అయితే, ఆ నలుగురు ఓపెనర్లలో ఒకరు రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించారు. 
  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top