
కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌తో గంభీర్
టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) తీరుపై భారత మాజీ క్రికెటర్ బల్విందర్ సంధు (Balvinder Sandhu) ఆగ్రహం వ్యక్తం చేశాడు. కోచ్‌గా చేయాల్సిన పని మీద మాత్రమే దృష్టి పెడితే బాగుంటుందని హితవు పలికాడు. ప్రతీ విషయాన్ని వ్యక్తిగతంగా తీసుకుని.. దిగ్గజాల గురించి కఠినంగా మాట్లాడాల్సిన అవసరం లేదంటూ చురకలు అంటించాడు.
అసలేం జరిగిందంటే.. మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడేందుకు భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే, ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు ప్రకటించిన జట్టులో యువ పేసర్ హర్షిత్ రాణా (Harshit Rana)కు చోటు ఇవ్వడం పట్ల విమర్శలు వచ్చాయి. సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ తాను ఫిట్‌గానే ఉన్నానని చెప్పినా.. అతడిని కాదని హర్షిత్‌కు పెద్ద పీట వేయడం విమర్శలకు దారితీసింది.
ఐపీఎల్-2024లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఆడుతున్న క్రమంలో అప్పటి మెంటార్ గంభీర్‌కు ప్రియ శిష్యుడైన కారణంగానే.. ఇప్పుడు వరుస అవకాశాలు వస్తున్నాయనే విమర్శలు వచ్చాయి. టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ చీఫ్ సెలక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ప్రధానంగా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. తనదైన శైలిలో గంభీర్- హర్షిత్‌ల గురించి కామెంట్ చేశాడు.
చిక్కాపై గంభీర్ ఫైర్
ఈ నేపథ్యంలో ఇటీవల వెస్టిండీస్‌తో రెండో టెస్టు ముగిసిన తర్వాత మీడియా ముందుకు వచ్చిన గంభీర్ స్పందించాడు. ‘‘యూట్యూబ్ చానెళ్ల వ్యూస్ కోసం 23 ఏళ్ల కుర్రాడిని టార్గెట్ చేస్తారా? కావాలంటే నన్ను ఏమైనా అనండి. అతడి జోలికి మాత్రం వెళ్లవద్దు. వాళ్ల నాన్న క్రికెటరో, సెలక్టరో కాదు’’ అంటూ చిక్కాపై ఫైర్ అయ్యాడు.
ఈ క్రమంలో భారత మాజీ పేసర్, 1983 గెలిచిన భారత జట్టులో చిక్కా సహచర సభ్యుడైన బల్విందర్ సంధు గంభీర్ వ్యాఖ్యలపై స్పందించాడు. మిడ్-డేతో మాట్లాడుతూ.. ‘‘ఏ విషయం గురించైనా ప్రతి ఒక్కరికి తమకంటూ కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. వాటితో ఇతరులు ఏకీభవించాలన్న నియమం లేదు.
పబ్లిక్‌గా అంత మాట అంటావా?
అయితే, పబ్లిక్‌గా చిక్కా గురించి అలా మాట్లాడంలో అర్థం లేదు. అవును.. శ్రీకాంత్ బ్యాటింగ్‌లాగే.. అతడి మాటలు కూడా ఉంటాయి. అందుకే అతడిని చాలా మంది ఇష్టపడతారు కూడా!.. సెలక్షన్ గురించి విమర్శించేటపుడు కొంతమంది మాజీ క్రికెటర్లు హద్దులు దాటుతున్న మాట వాస్తవమే.
అందుకు సోషల్ మీడియాలో వారిపై భారీ ఎత్తున ట్రోలింగ్ కూడా జరుగుతోంది. అయినంత మాత్రాన స్వేచ్ఛగా మాట్లాడే మాజీ ప్లేయర్ల హక్కును హరించేందుకు వీలులేదు. దేశం కోసం కష్టపడి, ఇష్టపడి ఆడిన వాళ్లు ఇలాంటి వాటిని పొందేందుకు ఎంత మాత్రం అర్హులు కాదు.
హెడ్‌కోచ్‌గా నీ పనేంటో చూసుకో
సలహాలు ఇస్తే క్రీడాస్ఫూర్తితో స్వీకరించే విధంగా మన ప్రవర్తన ఉండాలి. హెడ్‌కోచ్‌గా మైదానంలో ఎలాంటి వ్యూహాలు, ప్రణాళికలతో ముందుకు వెళ్లాలన్న అంశం మీద మాత్రమే దృష్టి పెడితే బాగుంటుంది. అలా కాకుండా ఇలా ప్రతి చిన్న విషయాన్ని పట్టుకుని వేలాడితే అసలు లక్ష్యం పక్కదారి పడుతుంది.
శ్రీకాంత్ అభిప్రాయాల గురించి గౌతం గంభీర్ చేసిన వ్యాఖ్యలు చదువుతుంటే నా మనసుకు ఎంతో బాధ కలిగింది. మాజీ ఆటగాడిని ఉద్దేశించి మీడియా ముఖంగా ఇలా మాట్లాడటం ఎంతమాత్రం సరికాదు’’ అని బల్విందర్ సంధు గంభీర్ తీరును విమర్శించాడు.
చదవండి: రోహిత్ శర్మతో విభేదాలు!.. స్పందించిన శుబ్‌మన్ గిల్