
సాక్షి, హైదరాబాద్: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఎపెక్స్ కౌన్సిల్ సభ్యుడిగా ఆంధ్ర మాజీ క్రికెటర్ వి.చాముండేశ్వరనాథ్ ఎన్నికయ్యారు. ఇండియన్ క్రికెటర్స్ అసోసియేషన్ (ఐసీఏ) పురుషుల క్రికెటర్ల ప్రతినిధిగా ఆయన కౌన్సిల్‌కు ఎన్నికయ్యారు. బుధ, గురువారాల్లో జరిగిన ఐసీఏ ఎన్నికల్లో అపెక్స్ కౌన్సిల్ పదవి కోసం ఎన్నిక జరిగింది. ఇందులో చాముండి 755–83 ఓట్ల తేడాతో రాజేశ్ జడేజాపై గెలుపొందారు.
ఇప్పటి వరకు చాముండి ఐసీఏ ప్రతినిధిగా ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌లో ఉన్నారు. దిలీప్ వెంగ్సర్కార్ స్థానంలో ఎపెక్స్ కౌన్సిల్‌లోకి వచ్చిన ఆయన మూడేళ్ల పాటు పదవిలో ఉంటారు. ఐసీఏ ఎన్నికల్లో భారత మాజీ కెప్టెన్ శాంత రంగస్వామి అధ్యక్షురాలిగా, వి.సుందరమ్ కార్యదర్శిగా ఎంపికయ్యారు. ఎపెక్స్ కౌన్సిల్ మహిళా క్రికెటర్ల ప్రతినిధిగా సుధా షా ఎంపిక కాగా...ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌లో శుభాంగి కులకర్ణికి అవకాశం దక్కింది.
చదవండి: IND vs AUS: కెప్టెన్సీ నుంచి తొలగిస్తారని భయపడ్డా: సూర్యకుమార్ యాదవ్