ఆర్సీబీ కోచ్‌ లేదంటే మెంటార్‌గా వస్తా: ఏబీ డివిలియర్స్‌ | Never Say Never: AB de Villiers Hints At RCB Return Ahead Of IPL 2026 | Sakshi
Sakshi News home page

ఆర్సీబీ కోచ్‌గా లేదంటే మెంటార్‌గా వస్తా: ఏబీ డివిలియర్స్‌

Aug 25 2025 1:45 PM | Updated on Aug 25 2025 1:48 PM

Never Say Never: AB de Villiers Hints At RCB Return Ahead Of IPL 2026

కోహ్లితో ఏబీ డివిలియర్స్‌ (PC: BCCI/IPL)

సౌతాఫ్రికా క్రికెట్‌ దిగ్గజం ఏబీ డివిలియర్స్‌ (AB de Villiers)కు ఉన్న ఫ్యాన్‌ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏడేళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌.. ఆ తర్వాత ఫ్రాంఛైజీ క్రికెట్‌తోనూ అభిమానులను అలరించాడు.

ముఖ్యంగా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL)లో ఈ మిస్టర్‌ 360 డిగ్రీ ప్లేయర్‌ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ (ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్‌)తో తన ఐపీఎల్‌ ప్రయాణం ప్రారంభించిన డివిలియర్స్‌.. 2011లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (RCB)లో చేరాడు. రిటైర్మెంట్‌ వరకు అదే జట్టుతో కొనసాగిన ఏబీడీకి ఆర్సీబీతో ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. 

కోహ్లితో కలిసి సంబరాలు
ఐపీఎల్‌-2025 ఫైనల్లో ఆర్సీబీ గెలవగానే యూనివర్సల్‌ బాస్‌, వెస్టిండీస్‌ విధ్వంసకర వీరుడు క్రిస్‌ గేల్‌తో కలిసి డివిలియర్స్‌ కూడా విరాట్‌ కోహ్లి (Virat Kohli)తో కలిసి సంబరాలు చేసుకున్నాడు. పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన టైటిల్‌ పోరులో ఆర్సీబీకి మద్దతుగా వచ్చి.. ఆర్సీబీ పదిహేడేళ్ల సుదీర్ఘకల నెరవేరగానే డివిలియర్స్‌ కూడా భావోద్వేగానికి గురయ్యాడు.

ఇక ఆర్సీబీ ఫ్యాన్స్‌ ఇప్పటికీ డివిలియర్స్‌ తమ జట్టులో భాగంగానే భావిస్తారు. అతడు తిరిగి వస్తే బాగుంటుందని సోషల్‌ మీడియా వేదికగా తమ అభిలాషను తెలుపుతూ ఉంటారు. ఇక ఇందుకు సమయం ఆసన్నమైనట్లే కనిపిస్తోంది. డివిలియర్స్‌ స్వయంగా ఈ విషయంపై స్పందించాడు.

కోచ్‌ లేదంటే మెంటార్‌గా..
అయితే, ఆటగాడిగా రీఎంట్రీ కాకుండా.. కోచ్‌ లేదంటే మెంటార్‌ పాత్రలో ఆర్సీబీలో చేరే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చాడు. ‘‘భవిష్యత్తులో నేను మళ్లీ ఐపీఎల్‌లో భాగమయ్యే అవకాశం ఉంది. అయితే, సీజన్‌ ఆసాంతం ప్రొఫెషనల్‌ విధులు నిర్వర్తించేందుకు నేను సిద్ధంగా లేను.

మనసంతా ఆర్సీబీతోనే
ఆరోజులు ముగిసిపోయాయి. ఏదేమైనా నా మనసు ఎల్లప్పుడూ ఆర్సీబీతోనే ఉంటుంది. ఒకవేళ ఆర్సీబీ ఫ్రాంఛైజీ నాకు కోచ్‌ లేదా మెంటార్‌గా బాధ్యతలు అప్పగించాలని భావిస్తే.. అందుకు నేను సిద్ధంగా ఉన్నాను. భవిష్యత్తులో ఐపీఎల్‌లో పునరాగమనం చేస్తే కచ్చితంగా ఆర్సీబీతోనే ఉంటాను’’ అని డివిలియర్స్‌ వార్తా సంస్థ IANSతో పేర్కొన్నాడు.

పరుగుల వీరుడు
కాగా సౌతాఫ్రికా తరఫున 2004- 2018 వరకు అంతర్జాతీయ క్రికెట్‌ ఆడాడు డివిలియర్స్‌. తన కెరీర్‌లో 114 టెస్టులు, 228 వన్డేలు, 78 అంతర్జాతీయ టీ20లు ఆడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. ఆయా ఫార్మాట్లలో 8765, 9577, 1672 పరుగులు సాధించాడు.

ఇక ఐపీఎల్‌లో 184 మ్యాచ్‌లు ఆడిన ఏబీ డివిలియర్స్‌ 5162 పరుగులు సాధించాడు. ఇందులో 40 హాఫ్‌ సెంచరీలు, మూడు సెంచరీలు ఉ‍న్నాయి. 2021లో ఆర్సీబీ తరఫున కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో పోరులో డివిలియర్స్‌ చివరగా తన ఐపీఎల్‌ మ్యాచ్‌ ఆడాడు.

చదవండి: నేను ఎదుర్కొన్న కఠినమైన బౌలర్లు వారే: ఛతేశ్వర్‌ పుజారా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement