
2026 టోర్నీకి అర్హత సాధించిన రెండు జట్లు
దుబాయ్: వచ్చే ఏడాది భారత్, శ్రీలంక వేదికగా జరగనున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) పురుషుల టి20 ప్రపంచకప్‌నకు నమీబియా, జింబాబ్వే అర్హత సాధించాయి. ఆఫ్రికా రీజినల్ టోర్నమెంట్‌లో ఫైనల్‌కు చేరడం ద్వారా ఈ రెండు జట్లు వరల్డ్‌కప్ బెర్త్ దక్కించుకున్నాయి. సెమీఫైనల్లో జింబాబ్వే 7 వికెట్ల తేడాతో కెన్యాపై విజయం సాధించగా... నమీబియా 63 పరుగుల తేడాతో టాంజానియాపై గెలుపొందింది. తద్వారా మెగా టోర్నీకి అర్హత సాధించాయి.
2026 ఫిబ్రవరి, మార్చి మధ్య జరగనున్న ఈ టోర్నీలో మొత్తం 20 దేశాలు పాల్గొంటాయి. అందులో భారత్, శ్రీలంక ఆతిథ్య హక్కులతో నేరుగా అర్హత సాధించగా... 2024 వరల్డ్‌కప్‌లో మెరుగైన ప్రదర్శన చేసిన అఫ్గానిస్తాన్, ఆ్రస్టేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, అమెరికా, వెస్టిండీస్ జట్లు వరల్డ్‌కప్ బెర్త్ దక్కించుకున్నాయి. ఐర్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్ ర్యాంకింగ్స్ ప్రకారం అర్హత సాధించాయి.
దీంతో మొత్తం 12 జట్లు మెగా టోర్నీ బెర్త్ దక్కించుకోగా... మిగిలిన ఎనిమిది జట్లను వివిధ క్వాలిఫయింగ్ టోర్నీల ద్వారా ఎంపిక చేస్తారు. ఇప్పటికే జరిగిన అమెరికా క్వాలిఫయర్స్‌లో కెనడా జట్టు... యూరప్ క్వాలిఫయర్స్‌లో ఇటలీ, నెదర్లాండ్స్ జట్లు టోర్నీకి బెర్త్ దక్కించుకోగా... తాజాగా ఆఫ్రికా క్వాలిఫయర్స్ నుంచి నమీబియా, జింబాబ్వే ముందంజ వేశాయి. దీంతో వరల్డ్‌కప్‌లో పాల్గొనబోయే 17 జట్లపై స్పష్టత రాగా... ఆసియా క్వాలిఫయర్స్ ద్వారా మరో మూడు జట్లను ఎంపిక చేయనున్నారు.