చాలా కష్టంగా ఉంది.. ధోనీకేమైంది?

MS Dhoni coughing and struggling in the last two overs - Sakshi

దుబాయ్‌ : భారీ అంచనాలతో ఐపీఎల్‌ బరిలో​కి దిగిన మాజీ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌.. ఆదిలోనే తడబడుతోంది. హాట్‌ఫేవరెట్‌గా దుబాయ్‌లో అడుగుపెట్టిన ధోనీ సేన అభిమానుల అంచనాలను అందుకోలేకపోతుంది. లీగ్‌ తొలి మ్యాచ్‌లోనే డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌పై విజయంతో టోర్నీని బోణీ చేసిన సీఎస్‌కే.. ఆ తరువాత పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి పడిపోయింది. వరస ఓటములు పరంపరను కొనసాగిస్తూ శుక్రవారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఓటమిని మూడగట్టుకుంది. తాజా మ్యాచ్‌తో ఈ లీగ్‌లో ధోనీ సేన హ్యాట్రిక్‌ ఓటములను నమోదు చేసింది. అయితే ఎన్నడూ లేని విధంగా ధోనీ చివరి వరకు నిలిచినా జట్టుకు విజయాన్ని అందించడంలో విఫలంకావడంతో అభిమానులు విస్మయానికి గురవుతున్నారు. (‘ప్రియ’మైన విజయం)

ఇన్నింగ్స్‌ చివరి వరకు క్రిజ్‌లో నిలిచిన ధోని (36 బంతుల్లో 47 నాటౌట్‌; 4 ఫోర్లు, 1 సిక్స్‌) అజేయంగా నిలిచినప్పటికీ.. వేగంగా ఆడటంలో విఫలమయ్యాడు. మిగతా జట్లు 200 పరుగులను సునాయాసంగా ఛేదిస్తుంటే రైజర్స్‌ విధించిన 164 పరుగుల లక్ష్యం సీఎస్‌కేకు కష్టతరంగా మారింది. చివరికి 7 పరుగులతో ఓటమిని మూడగట్టుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో ధోనీ తీరు చర్చనీయాంశంగా మారింది. వికెట్ల మధ్య చిరుతలా పరిగెత్తే మిస్టర్‌ కూల్‌.. గత మ్యాచ్‌లో తీవ్రంగా అలసిపోయాడు. ఒకానొక సందర్భంలో ఇక పరిగెత్తడం తన వల్ల కాదనే స్థితిలోకి వెళ్లాడు. అయితే దుబాయ్‌లో ఎక్కువగా పొడి వాతావరణం ఉన్న కారణంగానే ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొవాల్సి వచ్చిందని ధోనీ వివరించాడు. (రైనాకు మరోషాక్‌.. చెన్నై కాంట్రాక్టు రద్దు..!)

బంతిని బలంగా బాదడం కష్టమైంది
మ్యాచ్‌ అనంతరం కెప్టెన్‌ మాట్లాడుతూ.. 'ఇక్కడి పరిస్థితుల కారణంగా గొంతు చాలా తొందరగా ఎండుకపోయి దగ్గుబాగా వచ్చి ఇబ్బందిగా మారింది. రన్స్‌ తీయడం కష్టంగా మారింది. మిడిల్ ఓవర్లలో బంతిని బలంగా బాదడం కష్టతరమైంది. చాలా కాలం తర్వాత మేం వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడాం. క్యాచ్‌లు, చేజార్చడం, నోబాల్స్ వేయడంతో ఓటమి పాలయ్యాం. డెత్‌ ఓవర్లలో రెండు చెత్త ఓవర్లు వేశాం. లీగ్ మ్యాచ్‌లు కాబట్టి నడుస్తుంది. అదే నాకౌట్ దశలో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. తదుపరి మ్యాచ్‌‌కు మా తప్పిదాలను సవరించుకొని బరిలోకి దిగుతాం’ అని ధోనీ తెలిపాడు. కాగా 2014 ఐపీఎల్ సీజన్ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

‘రికార్డు’ ధోనికి రైనా అభినందన ...
ఐపీఎల్‌లో మహేంద్ర సింగ్‌ ధోనికి ఇది 194వ మ్యాచ్‌. దీంతో అతను ఈ లీగ్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా ఘనత సృష్టించాడు. ఇప్పటి వరకు సురేశ్‌ రైనా (193) పేరిట ఈ రికార్డు ఉంది. ఈ సందర్భంగా రైనా ట్వీట్‌ ద్వారా ధోనికి అభినందనలు చెప్పాడు. వ్యక్తిగత కారణాలతో రైనా ఐపీఎల్‌ ఆరంభానికి ముందే తప్పుకున్నాడు. ‘ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన మాహి భాయ్‌ (ధోని)కి నా అభినందనలు. నా రికార్డును నువ్వు అధిగమించడం సంతోషంగా ఉంది. చెన్నై జట్టు ఈ సారి ఐపీఎల్‌ గెలుస్తుందని నమ్ముతున్నా’ అని రైనా ట్వీట్‌ చేశాడు. అత్యధిక మ్యాచ్‌ల జాబితాలో రోహిత్‌ శర్మ (192) ప్రస్తుతం ధోని వెనకే ఉన్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top