తొలి స్పిన్నర్‌గా మొయిన్‌ రికార్డు

Moeen Becomes First Spinner To Dismiss Virat Kohli For A Duck - Sakshi

చెన్నై: ఇంగ్లండ్‌తో ఇక్కడ జరుగుతున్న రెండో టెస్టులో భాగంగా తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా ఆరు వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ(161; 231 బంతుల్లో 18 ఫోర్లు, 2 సిక్స్‌లు), అజ్యింకా రహానే(67; 149 బంతుల్లో 9ఫోర్లు)లు రాణించడంతో టీమిండియా పటిష్టమైన స్థితిలో నిలిచింది. ఈ జోడీ 162 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడంతో టీమిండియా తిరిగి తేరుకుంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమిండియా.. 86 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ తరుణంలో రోహిత్‌-రహానేల జోడి ఆదుకుంది.

కాగా, వీరిద్దరూ స్పల్ప వ్యవధిలో ఔటైన తర్వాత టీమిండియా శిబిరంలో కాస్త ఆందోళన నెలకొంది.  ఇన్నింగ్స్‌ 73 ఓవర్‌లో రోహిత్‌ ఔట్‌ కాగా,  76 ఓవర్‌లో రహానే పెవిలియన్‌ చేరాడు. రోహిత్‌ను జాక్‌ లీచ్‌ బోల్తా కొట్టించగా,  రహానేను మొయిన్‌ ఒక అద్భుతమైన బంతితో బౌల్డ్‌ చేశాడు. తక్కువ ఎత్తులో వచ్చిన బంతి ఆఫ్‌ సైడ్‌ పడి వికెట్ల మీదుకు రావడంతో రహానే ఔటయ్యాడు. ఇదిలా ఉంచితే, ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ డకౌట్‌ కాగా, విరాట్‌ కోహ్లి కూడా పరుగులేమీ నిష్క్రమించాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి రిషభ్‌ పంత్‌(33 బ్యాటింగ్‌; 56 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌),  అక్షర్‌ పటేల్‌( 5 బ్యాటింగ్‌; 7 బంతుల్లో 1 ఫోర్‌)లు క్రీజ్‌లో ఉన్నారు. 

తొలి స్పిన్నర్‌గా రికార్డు
టీమిండియా ఇన్నింగ్స్‌లో భాగంగా మొయిన్‌ అలీ వేసిన 22 ఓవర్‌ రెండో బంతికి కోహ్లి బౌల్డ్‌ అయ్యాడు. బంతిని కోహ్లి అంచనా వేసే లోపే అది గింగిరాలు తిరుగుతూ వికెట్లపైకి దూసుకుపోయింది. ఆ బంతికి కోహ్లి సైతం షాక్‌కు గురయ్యాడు. అసలు బంతి వికెట్లను తాకిందా.. లేక కీపర్‌ చేతులు తగిలి వికెట్లపడ్డాయా అనే సందిగ్థత కోహ్లి ముఖంలో కనబడింది. కానీ అది క్లియర్‌ ఔట్‌ కావడంతో కోహ‍్లి పెవిలియన్‌ చేరక తప్పలేదు. అయితే మొయిన్‌ ఖాతాలో ఒక అరుదైన రికార్డు చేరింది. టెస్టుల్లో కోహ్లిని డకౌట్‌ చేసిన తొలి స్పిన్నర్‌గా మొయిన్‌ రికార్డు సాధించాడు.    టెస్టుల్లో ఇప్పటివరకూ కోహ్లి 11సార్లు డకౌట్‌ కాగా స్పిన్నర్‌కు డకౌట్‌ కావడం ఇదే తొలిసారి. టెస్టుల్లో కోహ్లిని డకౌట్‌ చేసిన బౌలర్లలో అండర్సన్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌, ప్యాట్‌ కమిన్స్‌, బెన్‌ హిల్పెనాస్‌, స్టార్క్‌, లక్మాల్‌, అబు జాయద్‌, ప్లంకట్‌, రవి రాంపాల్‌, కీమర్‌ రోచ్‌లు ఉన్నారు. వీరంతా మీడియం పాస్ట్‌, పేసర్లు కావడం గమనార్హం.

ఇక్కడ చదవండి: ఐపీఎల్‌ 2021: కింగ్స్‌ పంజాబ్‌కు ‘వేలం’ కష్టాలు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top