Michael Vaughan: ‘అలా అయితే భారత్‌ను ఓడించడం కష్టమే’

Michael Vaughan: England Will Struggle To Beat India Unless Improve Batting - Sakshi

లండన్‌: ఇంగ్లండ్‌ క్రికెటర్లు తమ బ్యాటింగ్‌ను మెరుగుపరుచుకోకపోతే సొంతగడ్డపై టీమిండియాను ఓడించడం కష్టమేనని ఆ జట్టు మాజీ కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌ అభిప్రాయపడ్డాడు. అదే విధంగా.. సన్నద్ధలేమికి తోడు రొటేషన్‌ విధానం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని పేర్కొన్నాడు. కాగా భారత్‌- ఇంగ్లండ్‌ మధ్య ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్ 14 వరకు ఐదు టెస్ట్‌ల సిరీస్ జరుగనుంది. ఈ నేపథ్యంలో మైకేల్‌ వాన్‌ మాట్లాడుతూ.. ‘‘ ఇంగ్లండ్‌ జట్టుల శ్రీలంకను 2-0 తేడాతో ఓడించింది. పాకిస్తాన్‌ను మట్టికరిపించింది.. గతేడాది వెస్టిండీస్‌, దక్షిణాఫ్రికాపై విజయాలు సాధించింది.

అదే విధంగా ఇండియాకు వెళ్లింది.. అద్భుతమైన ప్రతిభా పాటవాలతో తొలి టెస్టులో గెలుపొందింది. జో రూట్‌ డబుల్‌ సెంచరీ చేశాడు. కానీ మూడు రోజుల తర్వాత రొటేటింగ్‌ పద్ధతి కారణంగా పరిస్థితులు మారిపోయాయి. నిజంగా ఇది చాలా తప్పు. అదే విధంగా.. ఇంగ్లండ్‌ నలుగురు సీమర్లు, ఒకే ఒ​క స్పిన్నర్‌తో ఆడటం సరైన నిర్ణయం కాదు’’ అని గత సిరీస్‌లో ఇంగ్లండ్‌ ఆడిన తీరును విమర్శించాడు.

ఇక ఇటీవల న్యూజిలాండ్‌కు సిరీస్‌ సమర్పించుకోవడం గురించి మాట్లాడుతూ.. ‘‘లార్డ్స్‌లో తొలి టెస్టుకు వారం ముందు నుంచే డ్రైగా ఉంది. అయినా ఒక్క స్పిన్నర్‌ లేడు. ఎడ్జ్‌బాస్టన్‌లో కూడా అంతే. స్పిన్నర్‌ లేకుండానే మైదానంలో దిగారు. తప్పులు పునరావృతం చేశారు’’ అని వాన్‌ చెప్పుకొచ్చాడు. అయితే, ప్రస్తుతం బట్లర్‌, స్టోక్స్‌, వోక్స్‌ ఫాంలోకి వచ్చారని, వాళ్ల రాకతో జట్టు బలం పెరుగుతుందన్న మైకేల్‌ వాన్‌.. బ్యాట్స్‌మెన్‌ గనుక విఫలమైతే భారత్‌ను ఓడించడం సాధ్యం కాదని అభిప్రాయం వ్యక్తం చేశాడు.

చదవండి: WTC 2021-23: టీమిండియా షెడ్యూల్‌ ఖరారు.. ఇంగ్లండ్‌ సిరీస్‌తో షురూ

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top