బుమ్రాకు ఇవ్వడం సరైనది కాదు!

The Man Of The Match Shouldve Been A Batsman, Manjrekar - Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన క్వాలిఫయర్‌-1లో నాలుగు వికెట్లు సాధించి ముంబై ఇండియన్స్‌ ఘన విజయంలో సహకరించిన జస్‌ప్రీత్‌ బుమ్రాకు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు ఇవ్వడాన్ని టీమిండియా మాజీ క్రికెటర్‌ మంజ్రేకర్‌ తప్పుబట్టాడు. అసలు ముంబై విజయానికి బీజం పడింది బ్యాట్స్‌మన్‌ రాణించిన కారణంగానే అనే విషయాన్ని ప్రస్తావించాడు. దాంతో బ్యాట్స్‌మెన్‌కే మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కాల్సిందని అన్నాడు. ఇక్కడ బుమ్రా, బౌల్ట్‌ ప్రదర్శనను తాను ఎక్కడా తక్కువ చేయడం లేదని, కానీ మ్యాచ్‌ను ఏకపక్షం మార్చడంలో బ్యాట్స్‌మెన్‌ కీలక పాత్ర పోషించరన్నాడు.

ఈ మేరకు ట్వీటర్‌లో క్వాలిఫయర్‌-1 మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ గురించి పోస్టు చేశాడు. ‘ మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు ఇచ్చేటప్పుడు హాఫ్‌ స్టేజ్‌ తర్వాత మ్యాచ్‌ ఎక్కడ మలుపు తీసుకుందో చూడాలి. ముంబై ఇండియన్స్‌ బ్యాటింగ్‌తోనే ఢిల్లీ తేలిపోయింది. కాబట్టి విన్నింగ్‌ ఇంపాక్ట్‌ బ్యాట్‌మెన్‌కే దక్కుతుంది. ఒక బ్యాట్స్‌మన్‌కు ఆ అవార్డు ఇస్తే బాగుండేది’ అని మంజ్రేక్‌ ట్వీట్‌ చేశాడు. ఐపీఎల్‌లో అత్యధిక టైటిళ్ల విజేత ముంబై ఇండియన్స్‌ మరో ఫైనల్స్‌కు సిద్ధమైంది. తొలి క్వాలిఫయర్‌లో ఎదురు పడిన ఢిల్లీని చితగ్గొట్టి, పడగొట్టి దర్జాగా తుది పోరుకు అర్హత సాధించింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 57 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇషాన్‌ కిషన్‌ (30 బంతుల్లో 55 నాటౌట్‌; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) సూర్య కుమార్‌ యాదవ్‌ (38 బంతుల్లో 51; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) వేగంగా అర్ధసెంచరీలు సాధించారు. ఆఖర్లో హార్దిక్‌ పాండ్యా (14 బంతుల్లో 37 నాటౌట్‌; 5 సిక్సర్లు) విరుచుకు పడ్డాడు. బుమ్రా నాలుగు  వికెట్లు సాధించడంతో పాటు 14 పరుగులే ఇచ్చి ఉత్తమ గణాంకాలు నమోదు చేశాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top