Legends League Cricket: Harbhajan Singh, Irfan Pathan To Lead Manipal Tigers, Bhilwara Kings - Sakshi
Sakshi News home page

Legends League Cricket Season 2: కెప్టెన్లుగా ఇర్ఫాన్‌ పఠాన్‌, హర్భజన్‌ సింగ్‌

Published Sat, Sep 3 2022 3:08 PM

Legends League Cricket: Harbhajan Singh, Irfan Pathan To Lead Manipal Tigers, Bhilwara Kings - Sakshi

సెప్టెంబర్ 16 నుంచి  ప్రారంభం కానున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్ రెండో ఎడిషన్‌కు సంబంధించి కెప్టెన్ల ఎంపిక ప్రక్రియ ముగిసింది. ఈ సీజన్‌లో పాల్గొనబోయే నాలుగు జట్లు తమ సారధుల పేర్లను ప్రకటించాయి. తొలుత  ఇండియా క్యాపిటల్స్ (గౌతమ్‌ గంభీర్‌) జట్టు, ఆతర్వాత గుజరాత్‌ జెయింట్స్‌ (వీరేంద్ర సెహ్వాగ్‌) జట్టు తమ కెప్టెన్ల పేర్లను ప్రకటించగా.. తాజాగా మణిపాల్‌ టైగర్స్‌, బిల్వారా కింగ్స్‌ ఫ్రాంచైజీలు తమ సారధుల పేర్లు వెల్లడించాయి. 

మణిపాల్‌ గ్రూప్‌ యాజమాన్యం చేజిక్కించుకున్న మణిపాల్‌ టైగర్స్‌.. టీమిండియా మాజీ స్పిన్నర్‌, ప్రస్తుత రాజ్యసభ ఎంపీ హర్భజన్‌ సింగ్‌ను తమ కెప్టెన్‌గా ఎంపిక చేసుకున్నట్లు ప్రకటించగా, ఎల్‌ఎన్‌జే బిల్వారా గ్రూప్‌ ఆధ్వర్యంలోని బిల్వారా కింగ్స్‌ టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ను తమ నాయకుడిగా ఖరారు చేసుకున్నట్లు వెల్లడించింది. తమను సారథులుగా ఎంపిక చేయడం పట్ల భజ్జీ, ఇర్ఫాన్‌లు ఆనందం వ్యక్తం చేశారు. తమ  ఎంపికకు 100 శాతం న్యాయం చేసేందుకు సర్వశక్తులా ప్రయత్నిస్తామని అన్నారు. 

ఈ సందర్భంగా వారిరువురు తమతమ యాజమాన్యాలకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, లీగ్‌కు సంబంధించి ఆటగాళ్ల ఎంపిక జరగాల్సి ఉంది. మరో రెండు, మూడు రోజుల్లో ఈ తంతు కూడా పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు నిర్వహకులు ప్రకటించారు.  ఈనెల 16 నుంచి ప్రారంభం కాబోయే ఎల్ఎల్‌సీ సీజన్-2 ఐదు వేదికలపై (కోల్‌కతా, లక్నో, న్యూఢిల్లీ, కటక్‌, జోధ్‌పూర్‌) 22 రోజుల పాటు (అక్టోబర్ 8 వరకు) సాగనుంది. 

లీగ్‌లో భాగంగా మొత్తం 16 మ్యాచ్‌లు జరుగనున్నాయి.  ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ ఉత్సవాల్లో (భారత్‌కు స్వాతంత్రం వచ్చి 75 వసంతాలు పూర్తైన సందర్భంగా నిర్వహిస్తున్న సంబురాలు) భాగంగా  టోర్నీ ఇనాగురల్‌ మ్యాచ్‌ జరుగనుంది. ఈ మ్యాచ్‌ ఇండియా మహారాజాస్, వరల్డ్ జెయింట్స్ జట్ల మధ్య జరుగనుంది. ఇండియా మహారాజాస్‌కు బీసీసీఐ బాస్‌ గంగూలీ సారధ్యం వహించనుండగా.. వరల్డ్ జెయింట్స్ జట్టుకు ఇయాన్‌ మోర్గాన్‌ నేతృత్వం వహించనున్నాడు. 
చదవండి: అభిమానులకు ఊహించని షాకిచ్చిన గంగూలీ!

Advertisement
 
Advertisement
 
Advertisement