చరిత్ర సృష్టించిన కేఎల్‌ రాహుల్‌.. 19 ఏళ్లలో ఒకే ఒక్కడు | KL Rahul becomes 1st Indian to score 150 in IPL, | Sakshi
Sakshi News home page

IPL 2026: చరిత్ర సృష్టించిన కేఎల్‌ రాహుల్‌.. 19 ఏళ్లలో ఒకే ఒక్కడు

Apr 25 2026 6:51 PM | Updated on Apr 25 2026 7:46 PM

KL Rahul becomes 1st Indian to score 150 in IPL,

ఐపీఎల్‌-2026లో అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్  విశ్వరూపం ప్రదర్శించాడు. పంజాబ్ బౌల‌ర్ల‌ను కేఎల్‌ రఫ్పాడించాడు. అరుణ్ జైట్లీ మైదానంలో రాహుల్ బౌండ‌రీల వ‌ర్షం కురిపించాడు.

అతడు బ్యాటింగ్ ధాటికి పంజాబ్ ఫీల్డ‌ర్లు కేవ‌లం ప్రేక్ష‌క పాత్ర మాత్ర‌మే పోషించాల్సి వ‌చ్చింది. రాహుల్‌ను ఔట్ చేయ‌డం ఎవ‌రి త‌రం కాలేదు. ఈ క్ర‌మంలో రాహుల్ కేవ‌లం 47 బంతుల్లోనే త‌న ఆరువ ఐపీఎల్ సెంచ‌రీ మార్క్‌ను అందుకున్నాడు.

ఓవ‌రాల్‌గా కేవ‌లం 67 బంతులు మాత్ర‌మే ఎదుర్కొన్న రాహుల్‌.. 16 ఫోర్లు, 9 సిక్స్‌లతో 152 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇక ఈ విధ్వంస‌క‌ర సెంచ‌రీతో రాహుల్ ప‌లు అరుదైన రికార్డుల‌ను త‌న పేరిట లిఖించుకున్నాడు.

రాహుల్‌ సాధించిన రికార్డులు ఇవే
👉ఐపీఎల్‌లో అత్య‌ధిక వ్య‌క్తిగ‌త స్కోర్ సాధించిన భార‌త క్రికెట‌ర్‌గా రాహుల్ చ‌రిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు 19 ఏళ్ల ఐపీఎల్‌ చరిత్రలో రాహుల్‌ కంటే ముందు ఏ ఒక్క భారత ఆటగాడు కూడా 150 పరుగుల మార్క్‌ను అందుకోలేకపోయాడు. ఇంతకుముందు వరకు  సన్‌రైజర్స్ స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ సాధించిన 141 పరుగులే అత్యధిక వ్యక్తిగత స్కోర్‌గా ఉండేది.

👉ఓవరాల్‌గా ఐపీఎల్ చరిత్రలో ఇది మూడవ అత్యధిక వ్యక్తిగత స్కోర్. తొలి రెండు స్ధానాల్లో క్రిస్ గేల్ (175*), బ్రెండన్ మెకల్లమ్ (158*) ఉన్నారు.

👉ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ప్లేయర్‌గా రాహుల్(47) నిలిచాడు. గతంలో ఈ రికార్డు క్వింటన్ డికాక్(48) పేరిట ఉండేది.

👉ఐపీఎల్‌లో అ‍త్యధిక సెంచరీలు చేసిన జాబితాలో క్రిస్ గేల్‌తో కలిసి మూడో స్ధానంలో రాహుల్ నిలిచాడు. అతడి కంటే ముందు విరాట్ కోహ్లి(8), జోస్ బట్లర్ (7) ఉన్నారు.



 

 

Advertisement
 
Advertisement
Advertisement