ఉత్కం‘టై’లో... పంజాబ్‌ సూపర్‌ గెలుపు

Kings XI Punjab beat Mumbai Indians in the Super Over - Sakshi

ముంబై వరుస విజయాలకు చెక్‌

ఐపీఎల్‌లో చరిత్రకెక్కిన డబుల్‌ ‘టై’

దుబాయ్‌: సూపర్‌+సూపర్‌ ఆటకు తెరలేపిన ఈ మ్యాచ్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ గెలిచింది. తొలి సూపర్‌ ‘ఆరు’ బంతులాటలో సింగిల్‌ డిజిటే నమోదైంది. పంజాబ్‌ ముందుగా పూరన్‌ (0), రాహుల్‌ (4) వికెట్లను కోల్పోయి 5 పరుగులే చేస్తే... ముంబై కూడా డికాక్‌ (3) వికెట్‌ కోల్పోయి ఐదు పరుగులే చేయడంతో సూపర్‌ ఓవర్‌ కూడా ‘టై’ అయ్యింది. దీంతో ఫీల్డ్‌ అంపైర్లు సమాలోచనలు జరిపి మరో సూపర్‌ ఓవర్‌ను ఆడించారు. ఈసారి తొలుత ముంబై హర్దిక్‌ పాండ్యా (1) వికెట్‌ కోల్పోయి 11 పరుగులు చేసింది.

తర్వాత పంజాబ్‌... గేల్‌ (7) సిక్స్, మయాంక్‌ (8) 2 ఫోర్లతో ఇంకో రెండు బంతులుండగానే 15 పరుగులు చేసి గెలిచింది.   అంతకుముందు టాస్‌ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు చేసింది. డికాక్‌ (43 బంతుల్లో 53; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించగా... పొలార్డ్‌ (12 బంతుల్లో 34 నాటౌట్‌; 1 ఫోర్, 4 సిక్స్‌లు) చెలరేగాడు. పంజాబ్‌ బౌలర్లలో షమీ, అర్‌‡్షదీప్‌ చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి సరిగ్గా 176 పరుగులే చేయడంతో మ్యాచ్‌ ‘టై’ అయింది. రాహుల్‌ (51 బంతుల్లో 77; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) విరోచిత పోరాటం చేశాడు. బుమ్రా 3 వికెట్లు తీశాడు.

ముంబై తడబాటు...
ముంబై ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే టాపార్డర్‌ వికెట్లను కోల్పోయింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (9), సూర్యకుమార్‌ యాదవ్‌ (0), ఇషాన్‌ కిషన్‌ (7) పంజాబ్‌ పేస్‌కు తలవంచారు. ఈ దశలో డికాక్, కృనాల్‌ పాండ్యా (30 బంతుల్లో 34; 4 ఫోర్లు, 1 సిక్స్‌) ఇన్నింగ్స్‌ను నిలబెట్టేందుకు శ్రమించారు. అడపాదడపా డికాక్‌ సిక్సర్లతో, కృనాల్‌ ఫోర్లతో మురిపించారు. అయితే రన్‌రేట్‌ మాత్రం ఆశించినంతగా పెరగలేదు. దీంతో జట్టు ఎనిమిదో ఓవర్లో 50, 14వ ఓవర్లో 100 పరుగులు చేసింది. డికాక్‌ 39 బంతుల్లో (3 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధసెంచరీ పూర్తిచేసుకున్నాడు. స్వల్ప వ్యవధిలో కృనాల్, హార్దిక్‌ (8), డికాక్‌ అవుటయ్యారు.

పొలార్డ్‌ మెరుపు ఇన్నింగ్స్‌...
చప్పగా సాగే ఇన్నింగ్స్‌కు పొలార్డ్‌ మెరుపులద్దాడు. అర్శ్‌దీప్‌ వేసిన ఇన్నింగ్స్‌ 18వ ఓవర్లో తొలి రెండు బంతుల్ని భారీ సిక్సర్లుగా మలిచాడు. కూల్టర్‌ నీల్‌ వరుసగా రెండు బౌండరీలు బాదడంతో ఈ ఓవర్లోనే 22 పరుగులు వచ్చాయి. షమీ తర్వాతి ఓవర్లో కూల్టర్‌ నీల్‌ మరో రెండు ఫోర్లు కొట్టాడు. ఇక జోర్డాన్‌ ఆఖరి ఓవర్లోనూ పొలార్డ్‌ 2 సిక్స్‌లు, ఓ ఫోర్‌ బాదడంతో 20 పరుగులు స్కోరుబోర్డుకు జతయ్యాయి. ఈ చివరి 3 ఓవర్లలోనే 54 పరుగులు రావడంతో స్కోరు అమాంతం పెరిగిపోయింది. కూల్టర్‌నీల్, పొలార్డ్‌ జోడీ అబేధ్యమైన ఏడో వికెట్‌కు కేవలం 21 బంతుల్లోనే 57 పరుగులు జోడించింది.

రాహుల్‌ జిగేల్‌...
పంజాబ్‌ ఇన్నింగ్స్‌లో ధాటిగా ఆడే ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌లో ఈసారి ఆ దూకుడేమి కనిపించలేదు. మరో ఓపెనర్, కెప్టెన్‌ లోకేశ్‌ రాహుల్‌ మాత్రం మెరిపించినా... ధనాదంచేసినా... బాధ్యతగా ఆడాడు. బౌల్ట్‌ వేసిన మూడో ఓవర్లో అతను చెలరేగాడు. ఐదు బంతులాడిన రాహుల్‌ 4, 4, 0, 6, వైడ్, 4లతో 20 పరుగులు పిండుకున్నాడు. కానీ తర్వాతి ఓవర్లోనే మయాంక్‌ (11)ను బుమ్రా క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. గేల్, రాహుల్‌ కలిసి కాసేపు వేగంగా నడిపించారు. గేల్‌ (24) అవుట్‌ కావడంతో ఈ జోడికి పదో ఓవర్లో చుక్కెదురైంది. రాహుల్‌ 35 బంతుల్లో (4 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఫిఫ్టీ పూర్తిచేసుకున్నాడు. పూరన్‌ (12 బంతుల్లో 24; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) భారీ షాట్లతో అలరించినా ఎంతోసేపు నిలువలేదు. మ్యాక్స్‌వెల్‌ (0) డకౌటయ్యాడు. దీంతో భారమంతా మోసిన రాహుల్‌ లక్ష్యానికి 23 పరుగుల దూరంలో బౌల్డయ్యాడు. హుడా (23 నాటౌట్‌), జోర్డాన్‌ (13) పోరాడటంతో గెలుపుదారిన పడ్డట్లే కనిపించింది. అయితే ఆఖరి ఓవర్లో 9 పరుగులు చేయాల్సివుండగా... మొదటి ఐదు బంతులకు వరుసగా 1, 4, 1, 0, 1తో 7 పరుగులొచ్చాయి. ఇక చివరి బంతికి 2 పరుగులు అవసరం కాగా.. జోర్డాన్‌ పరుగు చేసి రెండో పరుగు కోసం రనౌటయ్యాడు. దీంతో ఈ మ్యాచ్‌ కూడా ‘టై’ అయ్యింది.   

స్కోరు వివరాలు
ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ శర్మ (బి) అర్‌‡్షదీప్‌ సింగ్‌ 9; డికాక్‌ (సి) మయాంక్‌ (బి) జోర్డాన్‌ 53; సూర్యకుమార్‌ యాదవ్‌ (సి) మురుగన్‌ అశ్విన్‌ (బి) షమీ 0; ఇషాన్‌ కిషన్‌ (సి) మురుగన్‌ అశ్విన్‌ (బి) అర్‌‡్షదీప్‌ సింగ్‌ 7; కృనాల్‌ (సి) హుడా (బి) రవి బిష్ణోయ్‌ 34; హార్దిక్‌ (సి) పూరన్‌ (బి) షమీ 8; పొలార్డ్‌ (నాటౌట్‌) 34; కూల్టర్‌నీల్‌ (నాటౌట్‌) 24; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 176.  
వికెట్ల పతనం: 1–23, 2–24, 3–38, 4–96, 5–116, 6–119.
బౌలింగ్‌: మ్యాక్స్‌వెల్‌ 4–0–24–0, షమీ 4–0–30–2, అర్‌‡్షదీప్‌ సింగ్‌ 3–0–35–2, జోర్డాన్‌ 3–0–32–1, మురుగన్‌ అశ్విన్‌ 3–0–28–0, దీపక్‌ హుడా 1–0–9–0, రవి బిష్ణోయ్‌ 2–0–12–1.     

కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ ఇన్నింగ్స్‌: రాహుల్‌ (బి) బుమ్రా 77; మయాంక్‌ (బి) బుమ్రా 11; గేల్‌ (సి) బౌల్ట్‌ (బి) రాహుల్‌ చహర్‌ 24; పూరన్‌ (సి) కూల్టర్‌నీల్‌ (బి) బుమ్రా 24; మ్యాక్స్‌వెల్‌ (సి) రోహిత్‌ శర్మ (బి) రాహుల్‌ చహర్‌ 0; దీపక్‌ హుడా (నాటౌట్‌) 23; జోర్డాన్‌ (రనౌట్‌) 13; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 176.  
వికెట్ల పతనం: 1–33, 2–75, 3–108, 4–115, 5–153, 6–176. 
బౌలింగ్‌: బౌల్ట్‌ 4–0–48–0, కృనాల్‌ 2–0–12–0, బుమ్రా 4–0–24–3, కూల్టర్‌నీల్‌ 4–0–33–0, పొలార్డ్‌ 2–0–26–0, రాహుల్‌ చహర్‌ 4–0–33–2.  

మయాంక్, గేల్‌ విజయానందం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top