
అంతా ఊహించిందే జరిగింది. టీమిండియా వెటరన్ కరుణ్ నాయర్ విధర్బ జట్టుతో తెగదింపులు చేసుకున్నాడు. రాబోయే దేశవాళీ సీజన్‌లో తిరిగి కర్ణాటక తరపున ఆడేందుకు నాయర్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు క్రిక్‌బజ్ తమ కథనంలో పేర్కొంది. నాయర్ వ్యక్తిగత కారణాల వల్ల కర్ణాటకకు తిరిగి రావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
కాగా 2022లో కర్ణాటక జట్టులో చోటు కోల్పోయిన కరుణ్ నాయర్.. తన మకాంను విధర్బకు మార్చాడు. ఈ క్రమంలో రెండు సీజన్ల( 2023, 2024) పాటు విధర్బకు నాయర్ ప్రాతినిథ్యం వహించాడు. ఈ రెండు సీజనల్లోనూ కరుణ్ అద్బుతంగా రాణించాడు. ముఖ్యంగా రంజీ ట్రోఫీ 2024-25 సీజన్‌లో ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్ సంచలన ప్రదర్శన కనబరిచాడు.
గత సీజన్‌లో రంజీ ఛాంపియన్‌గా విధర్బ నిలవడంలో కరుణ్‌ది కీలక పాత్ర. ఈ టోర్నీలో 16 ఇన్నింగ్స్‌లలో 53.93 సగటుతో 863 పరుగులు చేసి నాలుగో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం విజయ్ హజారే ట్రోఫీలో (779 పరుగులు) కూడా తన సూపర్ ఫామ్‌ను కొనసాగించి విదర్భను రన్నరప్‌గా నిలబెట్టాడు.
ఈ ప్రదర్శనల కారణంగా కరుణ్ నాయర్ ఎనిమిదేళ్ల తర్వాత భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. నాయర్ ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్నాడు. కానీ ఇంగ్లండ్ గడ్డపై మాత్రం నాయర్ తన మార్క్‌ను చూపించలేకపోతున్నాడు. 6 ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 131 పరుగులు మాత్రమే చేశాడు.
ఇక ఇది ఇలా ఉండగా.. కర్ణాటక సీనియర్ పేసర్ వాసుకి కౌశిక్ వచ్చే సీజన్‌లో గోవా తరపున ఆడాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమలో కౌశిక్ ఇప్పటికే కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (KSCA) నుండి నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకున్నాడు. ఈ విషయాన్ని గోవా క్రికెట్ అసోసియేషన్ ధ్రువీకరించింది.
చదవండి: IND vs ENG: ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు.. బీసీసీఐ కీలక నిర్ణయం! ధోని శిష్యుడికి పిలుపు