
టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan) అండర్-16 క్రికెట్ నాటి సంగతులు గుర్తుచేసుకున్నాడు. విజయ్ మర్చంట్ ట్రోఫీలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని.. ఆటతోనే అందుకు సమాధానమిచ్చిన తీరును తాజాగా వెల్లడించాడు.
కళ్లు బైర్లు కమ్మాయి
‘‘పాల్ వాల్తాటి (Paul Valthaty) జూనియర్ క్రికెట్‌లో, ఐపీఎల్‌లో నాతో కలిసి ఆడాడు. అండర్-19 విజయ్ మర్చంట్ ట్రోఫీలో ఆరోజు ముంబై- బరోడా మధ్య మ్యాచ్. నిజానికి పాల్ బ్యాటర్. అయితే, మీడియం పేస్‌తో బౌల్ చేయగలడు కూడా.
ఆరోజుల్లో నేను బ్యాటింగ్ చేసేటపుడు ఎక్కువగా హెల్మెట్ ధరించేవాడిని కాదు. హెల్మెట్ పెట్టుకుంటే నాకు చూపు కాస్త మందగించినట్లు అనిపిస్తుంది. ఆరోజు కూడా హెల్మెట్ లేకుండా అతడి బౌలింగ్‌ను ఎదుర్కొంటున్నా.
ఈ క్రమంలో అతడు నాకు బౌన్సర్ సంధించాడు. నేను లెఫ్టాండ్ బ్యాటర్‌ను కదా!.. బంతి ఒకవేళ తగిలితే నా కుడిచెంపపై తాకాలి. నిజానికి బంతి మెల్లగానే వచ్చింది. కానీ నేను సడన్‌గా తిరగడంతో నా ఎడమ చెంపకు బలంగా తాకింది. నాకు కళ్లు బైర్లు కమ్మినట్లు అయిపోయింది.
రక్తం కూడా కారింది
నా చెంప నుంచి రెండు మూడు చుక్కల రక్తం కూడా నేలమీద పడింది. అంపైర్లు, రిఫరీ వచ్చి నన్ను డ్రెసింగ్‌రూమ్‌కు వెళ్లిపొమ్మని చెప్పారు. నేను అక్కడికి వెళ్లగానే మా కోచ్ మెహదీ షేక్.. ‘అబే.. నువ్వేరకం పఠాన్‌వి?’ అని అన్నారు. వెంటనే.. ‘నాతో ఇలా మాట్లాడకండి’ అన్నాను నేను.
ఆ తర్వాత బరోడా ప్లేయర్లలో ఎవరో ఒకరి వికెట్ పడాలని వేచి చూశాను. ఇంతలో ఫిజియో నా చెంపపై దూదితో కట్టు కట్టారు. అప్పటికి రక్తస్రావం తగ్గింది. వికెట్ పడగానే నేను బ్యాట్‌తో మళ్లీ మైదానంలో అడుగుపెట్టాను.
హాఫ్ సెంచరీ చేశాను
64 పరుగులతో అదరగొట్టాను. నేను గాయపడినపుడు ముంబై ఆటగాళ్లు నన్ను చూసి నవ్వారు. నాకు రక్తం కారుతున్నా వాళ్లు నవ్వుతూనే ఉండటంతో.. ఆ క్షణంలో నాకు బాగా కోపం వచ్చింది. అప్పుడే వాళ్లకు నేనేంటో చూపించాలని నిర్ణయించుకున్నా.
అప్పటికి మ్యాచ్ మా చేతుల్లోనే ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో మేమే ఆధిక్యంలో ఉన్నాము. ఇక ఆరోజు సాయంత్రం నేను ఆస్పత్రికి వెళ్లగా ముఖంపై 15 కుట్లు పడ్డాయి’’ అని ఇర్ఫాన్ పఠాన్ ‘హాల్ చాల్ ఔర్ సవాల్’ చానెల్‌తో పేర్కొన్నాడు.
టీమిండియా తరఫున సత్తా చాటిన ఇర్ఫాన్
కాగా బరోడాకు చెందిన ఇర్ఫాన్ పఠాన్ బౌలింగ్ ఆల్‌రౌండర్. లెఫ్టార్మ్ పేసర్ అయిన అతడు.. టీమిండియా తరఫున 29 టెస్టుల్లో 100, 120 వన్డేల్లో 173, 24 టీ20లలో 28 వికెట్లు కూల్చాడు.
అదే విధంగా.. టెస్టుల్లో 2076, వన్డేల్లో 1941, టీ20లలో 127 పరుగులు సాధించాడు ఇర్ఫాన్ పఠాన్. ఇక ఐపీఎల్ 103 మ్యాచ్‌లు ఆడి 946 పరుగులు చేయడంతో పాటు.. 80 వికెట్లు తన పేరిట లిఖించుకున్నాడు.
చదవండి: AUS vs ENG: అతడికి ఇక నిద్రలేని రాత్రులే!.. వార్నర్ ఓ జోకర్!